ఐపీఎల్‌ అడుగులు... ఆసక్తికరం...

Ipl 2019 auction young stars list - Sakshi

ఐపీఎల్‌ కొత్త కుర్రాళ్ల సత్తా నిరూపించుకునేందుకు సరైన వేదిక... లీగ్‌ ఆరంభం నుంచి అందరూ చెప్పే మాటే ఇది. అన్ని సందర్భాల్లో అంచనాల స్థాయిని అందుకునే విధంగా ఆడకపోయినా 2008 నుంచి చూస్తే ఎంతో మంది తమ అనూహ్య, మెరుపు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అందుకే లీగ్‌ వస్తోందంటే చాలు తొలిసారి బరిలోకి దిగుతున్నవారి ప్రతిభ ఎలాంటిదనేది అందరినీ ఆకర్షించే అంశం. అందుకే అసలు పోరుకు ముందు వేలంలో కూడా కొన్ని పేర్లు అందరిలో చర్చకు దారి తీస్తాయి. భారీ మొత్తాలకు అమ్ముడుపోయి కొందరు ఒక్కసారిగా చక్రవర్తులుగా మారిపోతే, భిన్నమైన నేపథ్యాలు మరికొందరి గురించి మళ్లీ మళ్లీ చదివిస్తాయి. మంగళవారం జరిగిన వేలంలో ఫ్రాంచైజీలు ఎంచుకున్న 40 మంది భారత ఆటగాళ్లలో అనేక మంది కుర్రాళ్లు తొలిసారి ఐపీఎల్‌ అవకాశం దక్కించుకున్నారు. వీరంతా తుది జట్టులో ఆడి సంచలనాలు సృష్టిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేకపోయినా వారి పరిచయం క్రికెట్‌ అభిమానులకు ఆసక్తికరం. అలాంటి క్రికెటర్లను చూస్తే....  

ప్రయస్‌ రే బర్మన్‌ (రూ.1.5 కోట్లు– బెంగళూరు)
ప్రస్తుత సీజన్‌లోనే బెంగాల్‌ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేసిన బర్మన్‌ 11 వికెట్లతో లీగ్‌ దశలో తమ జట్టు నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 16 ఏళ్ల ఈ లెగ్‌ స్పిన్నర్‌ ఒకప్పుడు విరాట్‌ కోహ్లితో ఫొటో దిగే అవకాశం వస్తే చాలనుకున్నాడు. ఇప్పుడు అతనితోనే కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోబోతున్నాడు. 6.1 అడుగుల ఎత్తు ఉన్న ఈ కుర్రాడి బౌలింగ్‌ శైలి అనిల్‌ కుంబ్లేను పోలి ఉంటుంది. తండ్రి ఢిల్లీలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. స్వస్థలం దుర్గాపూర్‌ కాగా, క్రికెట్‌లో ఎదిగేందుకు తల్లిదండ్రులను వదిలి కోల్‌కతా చేరాడు.     

శివమ్‌ దూబే (రూ. 5 కోట్లు– బెంగళూరు)
ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే ఎడంచేతి బ్యాట్స్‌మన్‌ కాగా, కుడిచేతి వాటం మీడియం పేస్‌ బౌలర్‌. 2007లో 14 ఏళ్ల వయసులో ముంబై ప్రతిష్టాత్మక స్కూల్‌ క్రికెట్‌ టోర్నీ గైల్స్‌ షీల్డ్‌ను తమ పాఠశాల హన్స్‌రాజ్‌ మొరార్జీ గెలుచుకోవడంలో దూబే కీలక పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగత కారణాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో అతను ఐదేళ్ల పాటు క్రికెట్‌ ఆడలేదు.  పూర్తి ఫిట్‌గా మారి అండర్‌–19 స్థాయిలో మళ్లీ తిరిగొచ్చాడు. అండర్‌–23లో రాణించిన అతను ఈ ఏడాది విజయ్‌ హజారే వన్డే టోర్నీలో సత్తా చాటి ముంబైకి టైటిల్‌ అందించాడు. రంజీ ట్రోఫీలో కూడా రెగ్యులర్‌గా మారిన దూబే ఈ సీజన్‌లో ఇప్పటికే 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు చేయడంతో పాటు 17 వికెట్లు కూడా పడగొట్టాడు. కొన్నాళ్ల క్రితం ముంబై టి20 లీగ్‌లో ప్రవీణ్‌ తాంబే ఓవర్లో ఐదు సిక్సర్లతో చెలరేగి మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శించిన దూబే... సోమవారం బరోడాతో మ్యాచ్‌లో స్వప్నిల్‌ సింగ్‌ ఓవర్లో కూడా ఐదు భారీ సిక్సర్లు బాది తనపై దృష్టి పడేలా చేశాడు. ఇప్పుడు భారీ మొత్తంతో ఆర్‌సీబీ అతడిని సొంతం చేసుకుంది.  

పంకజ్‌ జస్వాల్‌  (రూ.20 లక్షలు–ముంబై )
ప్రధానంగా పేస్‌ బౌలర్‌ అయిన పంకజ్, గత ఏడాది రంజీ ట్రోఫీలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి రెండో ఫాస్టెస్ట్‌గా రికార్డు నమోదు చేశాడు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కాంస్యం నెగ్గిన సమయంలో ఆ స్ఫూర్తితో తన కొడుకును కూడా రెజ్లర్‌ను చేసేందుకు పంకజ్‌ను తండ్రి ఢిల్లీలోని అఖాడాకు తీసుకెళ్లాడు. షోయబ్‌ అఖ్తర్‌ తరహాలో ఫాస్ట్‌ బౌలర్‌ కావాలనుకున్న పంకజ్‌ కోరికను అతను మన్నించలేదు. రెజ్లర్‌ తరహా శిక్షణ మొదలు పెట్టేసి, అదే డైట్‌ను అందించి వివిధ వయో విభాగాల్లో పంకజ్‌ను  ఆడించాడు కూడా. అయితే ఆ తర్వాత మనసు మార్చుకొని కొడుకును క్రికెటర్‌ను చేశాడు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల పంకజ్‌ దేశవాళీ టి20ల్లో ఆడిన 15 ఇన్నింగ్స్‌ల్లో 203 çస్టయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.  

హిమ్మత్‌ సింగ్‌  (రూ. 65 లక్షలు– బెంగళూరు)
మూడేళ్ల క్రితం జట్టు ఎంపికకు సంబంధించి హిమ్మత్‌ సింగ్‌ వార్తల్లో నిలిచాడు. విజయ్‌ హజారే టోర్నీలో ఎంపికయ్యేందుకు అతను రూ. 25 లక్షలు ఢిల్లీ సెలక్టర్లకు ఇచ్చాడంటూ కీర్తి ఆజాద్, బిషన్‌ సింగ్‌ బేడీ తదితరులు ఆరోపించారు. దీనిపై హిమ్మత్‌ తండ్రి పరువు నష్టం దావా కూడా వేశాడు. 22 ఏళ్ల హిమ్మత్‌ దేశవాళీ వన్డేల్లో 63.55 సగటుతో పరుగులు చేసిన రికార్డు ఉంది. ఇటీవల ముగిసిన ఎమర్జింగ్‌ కప్‌ టోర్నీలో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేయడం ఐపీఎల్‌ వేలంలో ఇతనికి కలిసొచ్చింది.  

ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (రూ. 4.8 కోట్లు– పంజాబ్‌)
‘10 ఓవర్లలో 100 పరుగులు ఒకసారి... 8 ఓవర్లలో 75 పరుగులు మరోసారి... ఒక జట్టు ఛేదించాల్సిన లక్ష్యాలు. నువ్వు క్రీజ్‌లో ఉంటే ఏం చేస్తావో చేసి చూపించు’... సెప్టెంబర్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఐపీఎల్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ సందర్భంగా ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌కు కోచ్‌ హెసన్‌ అడిగిన ప్రశ్న ఇది. దానికి సిమ్రన్‌... ఒకసారి 19 బంతుల్లో, మరోసారి 29 బంతుల్లో అర్ధసెంచరీలు చేసి సమాధానమిచ్చాడు. మూడు నెలల తర్వాత అదే జట్టు అతడిని వేలంలో రూ.4.8 కోట్లకు తీసుకోవడం విశేషం. పటియాలాకు చెందిన సిమ్రన్‌ హార్డ్‌ హిట్టింగ్‌ వికెట్‌ కీపర్‌. సరిగ్గా చెప్పాలంటే రిషభ్‌ పంత్‌కు కుడిచేతి వాటం వెర్షన్‌ లాంటివాడు. అక్టోబర్‌లో అతని సారథ్యంలోనే భారత్‌ అండర్‌–19 ఆసియా కప్‌ గెలుచుకుంది. ఫైనల్లో సిమ్రన్‌ 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు అంతర్‌ జిల్లా టోర్నీలో పటియాలా తరఫున బరిలోకి దిగి అమృత్‌సర్‌పై 301 బంతుల్లోనే 298 పరుగులు చేయడంతో సిమ్రన్‌కు గుర్తింపు లభించింది. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీకి ఎంపిక కావడం, ఆ తర్వాత భారత్‌ అండర్‌–19 టీమ్‌కు కెప్టెన్‌గా అవకాశం చకచకా జరిగిపోయాయి. శనివారం ఎమర్జింగ్‌ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో కూడా అతను సభ్యుడు. ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌లే అతను అధికారికంగా ఆడిన దేశవాళీ వన్డేలు. ఇవి మినహా ఫస్ట్‌ క్లాస్‌ కానీ టి20 మ్యాచ్‌ల అనుభవం కానీ లేకపోయినా అతను జాక్‌పాట్‌ కొట్టేశాడు.  

అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (రూ.80 లక్షలు–ముంబై)
ప్రభ్‌ సిమ్రన్‌కు అన్‌మోల్‌ స్వయంగా కజిన్‌. ఉమ్మడి కుటుంబంలో 20 ఏళ్ల అన్‌మోల్‌ స్ఫూర్తితోనే సిమ్రన్‌ క్రికెట్‌ వైపు మళ్లాడు. 2016 అండర్‌–19 ప్రపంచ కప్‌ సభ్యుడిగా అన్‌మోల్‌కు తొలిసారి గుర్తింపు లభించింది. గత ఏడాది పంజాబ్‌ తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి తొలి సీజన్‌లోనే 125.50 సగటుతో 753 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇటీవల ఇండియా ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌ ‘ఎ’పై కూడా రాణించాడు.  

రియాన్‌ పరాగ్‌ (రూ. 20 లక్షలు–రాజస్తాన్‌ )
తండ్రి పరాగ్‌ దాస్‌ 53 రంజీ మ్యాచ్‌లు ఆడిన అస్సాం సీనియర్‌ క్రికెటర్‌... తల్లి మిథు బారువా అంతర్జాతీయ స్విమ్మర్‌. ఆసియా చాంపియన్‌షిప్, ‘శాఫ్‌’ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె ఒకసారి 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో జాతీయ రికార్డు కూడా నెలకొల్పింది. ఇదీ అస్సాంకు చెందిన 17 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ నేపథ్యం. పదో తరగతి పరీక్షలకు కొద్ది రోజుల ముందు 15 ఏళ్ల వయసులో అస్సాం సీనియర్‌ జట్టు తరఫున ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌తో దేశవాళీ క్రికెట్‌లో రియాన్‌ అరంగేట్రం చేశాడు. గత ఏడాది భారత అండర్‌–19 జట్టు సభ్యుడిగా ఇంగ్లండ్‌లో రెండు యూత్‌ టెస్టులు ఆడి పృథ్వీ షా తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తొలి టెస్టులో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం విశేషం. మరోవైపు భారత అండర్‌–19 జట్టులోకి ఎంపికైన సమయంలోనే సీబీఎస్‌ఈ పరీక్షల్లో అతడు డిస్టింక్షన్‌లో పాసయ్యాడు కూడా.  

రసిఖ్‌ దార్‌ (రూ. 20 లక్షలు– ముంబై)
జమ్మూ కశ్మీర్‌ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మూడో క్రికెటర్‌గా 17 ఏళ్ల రసిఖ్‌ దార్‌ గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో కశ్మీర్‌ అండర్‌–19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌ నిర్వహించిన ట్రయల్స్‌ రెండు రౌండ్లలో కూడా ఈ కుర్ర పేసర్‌ ‘ది బెస్ట్‌’గా నిలిచాడు. ఇతని తండ్రి టీచర్‌గా పని చేస్తున్నాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top