మీరు తప్పు చేస్తే.. మేము భరించాలా?

IOA Blames NADA For NDTL Suspension - Sakshi

న్యూఢిల్లీ:  జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా)పై భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.  జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐఓఏ అధ్యక్షుడు నరిందర్‌ బత్రా మండిపడ్డారు. ఎన్‌డీటీఎల్‌ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడానికి నాడానే కారణమని బత్రా విమర్శలు గుప్పించారు. దాంతోనే నిషేధానికి గురైనట్లు పేర్కొన్నారు. ఈ నిషేధంతో సేకరించిన నమూనాలను ఇతర దేశాల్లో గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, ఇదంతా నాడా చేసిన తప్పిదం వల్లే జరిగిందని మండిపడ్డారు.

‘ నాడా చేసిన తప్పిదాలకు మేము అదనపు ఖర్చును భరించాలి. ఆర్నేళ్ల పాటు నాడా పరీక్షలు చేయాలంటే రూపాయిలకు బదులు డాలర్లు చెల్లించాలి. నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్స్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) దీన్ని భరించే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు దీన్ని ఎవరు భరిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు.

జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటి వరకు ల్యాబ్‌లో వివిధ దశల్లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది.  సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాడా విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ 21 రోజుల్లోపు నాడా అప్పీల్‌ చేసుకునే వీలుంది.(ఇక్కడ చదవండి: నాడాకు వాడా షాక్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top