‘యో–యో’ తర్వాతే ఎంపిక

 inform members about Yo Yo, says official - Sakshi

బీసీసీఐ నిర్ణయం

ముంబై: అద్భుతమైన ఆటతో జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్‌నెస్‌ ప్రమాణాలకు సంబంధించిన యో–యో పరీక్షలో విఫలమై టీమ్‌లో చోటు కోల్పోతే ఆటగాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి వచ్చిన అంబటి రాయుడుతో పాటు పేసర్‌ షమీ, భారత ‘ఎ’ ఆటగాడు సంజు శామ్సన్‌ ఈ దురదృష్టకర స్థితిలో నిలిచారు. దీనిపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాస్త మార్పుకు సిద్ధమైంది.

ఇకపై ఆటగాళ్లు యో–యో టెస్టులో సఫలం అయిన తర్వాతే జట్టును ప్రకటించాలని నిర్ణయించింది. దీని వల్ల క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై ముందే స్పష్టత రావడంతో పాటు స్థానం లభించిన తర్వాత మళ్లీ పోగొట్టుకున్నామనే భావన కూడా ఆటగాళ్లలో రాదు. సీఓఏ సభ్యులు, బోర్డు జనరల్‌ మేనేజర్‌ సబా కరీమ్, బోర్డు సీఈఓ జోహ్రి తదితరుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈసారి కొత్తగా రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్న బిహార్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల జట్లు గ్రూప్‌ ‘డి’లో పరస్పరం తలపడతాయి. ఫలితాలను బట్టి వీటిలోంచి ఒక జట్టు మాత్రమే క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుందని బోర్డు వెల్లడించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top