కివీస్‌తో వన్డే: అమ్మాయిలు అదరగొట్టారు

India Women Win By Odi Series Against New Zealand  - Sakshi

మెరిసిన మంధాన.. రాణించిన మిథాలీ

మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ మంధాన

మౌంట్‌మాంగనీ : న్యూజిలాండ్‌ గడ్డపై భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆతిథ్య జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి తాము ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు. ఇప్పటికే పురుషుల జట్టు వరుస విజయాలతో 3-0తో సిరీస్‌ కైవసం చేసుకోగా.. తాజాగా భారత అమ్మాయిలు సైతం సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన(90 నాటౌట్‌ : 83 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో మైమరిపించింది. ఈ డాషింగ్‌ బ్యాటర్‌కు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (63 నాటౌట్‌: 111 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ తోడవ్వడంతో భారత మహిళల విజయం సులువైంది. అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 161 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో జులాన్‌ గోస్వామి(3), ఏక్తా బిష్త్‌ (2), దీప్తి శర్మ(2), పూనమ్‌ యాదవ్‌ (2)లు చెలరేగడంతో కివీస్‌ బ్యాటర్స్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు.  కెప్టెన్‌ సాటర్‌వెయిట్‌ (71) మినహా మిగతా బ్యాటర్స్‌ దారుణంగా విఫలమయ్యారు. 

అనంతరం 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ డకౌట్‌ కాగా.. ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ దీప్తి శర్మ(8) తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో భారత్‌ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ స్మృతి మంధాన, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌లు ఆచితూచి ఆడుతూ భారత్‌కు విజయాన్నందించారు. మంధాన తనదైన శైలిలో విజృంభించగా.. మిథాలీ నెమ్మదిగా ఆడుతూ స్ట్రైక్‌ రొటేట్‌ చేసింది. ఈ క్రమంలో 54 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో మంధాన కెరీర్‌లో 14వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. అనంతరం మిథాలీ సైతం 102 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌తో కెరీర్‌లో 52వ అర్థ శతకం సాధించింది. దీంతో భారత్‌ 88 బంతులు మిగిలిఉండగానే 7 వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. ఇక మంధాన, మిథాలీలు మూడో వికెట్‌కు అజేయంగా 151 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. 

‘‘ఈ అవార్డును మా జట్టు బౌలర్లకు అందజేస్తాను. ఇది అందుకోవడానికి వారే నిజమైన అర్హులు. వారు అద్భుతంగా బౌలింగ్‌ చేసి న్యూజిలాండ్‌ను 161 పరుగులకే కట్టడి చేశారు. ఈ విజయంలో వారిదే కీలక పాత్ర’’- స్మృతి మంధాన, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌.

‘‘ మేం ప్రత్యర్థిపై సమిష్టిగా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడం అద్భుతం. ఇదే ఊపును కొనసాగిస్తూ హమిల్టన్‌ వేదికగా జరిగే మూడో వన్డేను సైతం నెగ్గి గణంకాలను 3-0గా మారుస్తాం. ఈ మ్యాచ్‌లో అమ్మాయిలు అద్భుతంగా రాణించారు’’- మిథాలీరాజ్‌, టీమిండియా కెప్టెన్‌
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top