ఇక్కడే ముగిస్తారా?

India target series clincher, South Africa look to survive   - Sakshi

సెంచూరియన్‌:దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అద్భుత విజయంతో పైచేయి సాధించిన విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. దాంతో మరొక విజయంపై భారత్‌ దృష్టి పెట్టింది. కాగా, దక్షిణాఫ్రికా మాత్రం సిరీస్‌ ఫలితాన్ని కడవరకూ తీసుకెళ్లాలనే యోచనలో ఉంది. దానిలో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టును కట్టడి చేయడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు తమ ప్రణాళికలో పదును పెడుతూ రెండో టీ 20 సిద్ధమవుతోంది. బుధవారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో రాత్రి గం. 9.30 ని.లకు ఇరు జట్ల మధ్య రెండో టీ 20 జరుగనుంది.

తొలి టీ20లో దక్షిణాఫ్రికాకు భారత జట్టు దిమ‍్మతిరిగే షాకిచ్చింది. తొలుత 203 పరుగుల భారీ స్కోరు సాధించి ఆపై 28 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చెలరేగి బౌలింగ్‌ చేసి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ అద్భుతమైన షాట్లతో సఫారీ పేస్‌ బౌలింగ్‌ పనిపట్టాడు. ఈ ఇద్దరి ప్రదర్శనతో భారత జట్టు అవలీలగా మ్యాచ్‌ను దక్కించుకుంది. ఇదే ఊపును రెండో టీ 20లో కూడా కొనసాగించి సిరీస్‌ను ముందుగా కైవసం చేసుకోవాలని విరాట్‌ గ్యాంగ్‌ భావిస్తోంది.

కోహ్లి ఫిట్‌ అవుతాడా..?

సఫారీలతో రెండో టీ 20లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆడటంపై సందిగ్థత నెలకొంది. తొలి టీ20లో మోకాలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో కోహ్లి మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు. దాంతో రెండో టీ20లో కోహ్లి పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మ్యాచ్‌ సమయానికి కోహ్లి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. అది చిన్న గాయమే కావడంతో కోహ్లి ఆడటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

సఫారీలకు పరీక్ష

ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను దారుణంగా కోల్పోయిన సఫారీలు.. కనీసం ట్వంటీ 20 సిరీస్‌ను దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. దాంతో రేపటి టీ 20 మ్యాచ్‌కు సఫారీలు ఒత్తిడిలో బరిలోకి దిగుతుంది. గాయాల బారిన దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  మరొకవైపు భారత జట్టు సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతుంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతూ సఫారీలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టుకు మరొక కఠినమైన సవాల్‌ తప్పకపోవచ్చు. సఫారీలు కూడా పూర్తి స్థాయి ప్రదర్శనపై దృష్టి సారించారు. దాంతో ఇరు జట్ల మధ్య మరో హోరాహోరీ పోరు ఖాయంగానే కనబడుతుంది. మరి టీమిండియా సిరీస్‌ను ఇక్కడే ముగిస్తుందా..లేక దక్షిణాఫ్రికా కడవరకూ తీసుకెళుతుందా అనేది ఆసక్తికరం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top