బంగ్లాదేశ్తో పోరుకు ధోని సేన సిద్ధం!

బంగ్లాదేశ్తో పోరుకు ధోని సేన సిద్ధం!


ఢాకా: తొలిసారి ట్వంటీ 20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియాకప్కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్తో పాటు క్వాలిఫయర్ యూఏఈలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ తొలిపోరులో ఆతిథ్య బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. ఢాకాలోని షేరే బంగ్లా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య రేపు రాత్రి గం.7.00లకు  మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ గా పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచీ టి20 ఫార్మాట్‌లో  అద్భుతంగా ఆడుతున్న భారత్.. ఇటీవల ట్వంటీ 20 ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆసియాకప్కు సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో మూడింటికి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో శ్రీలంకపై 2-1తో సిరీస్ ను సాధించింది. ఆసియాకప్ ద్వారా  పవన్ నేగి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.





మరోవైపు బంగ్లాదేశ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత ఏడాది స్వదేశంలో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వన్డే సిరీస్‌లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో బంగ్లా బరిలోకి దిగుతోంది. బంగ్లా ప్రీమియర్ లీగ్ ద్వారా ఈ జట్టుకు కూడా కావలసినంత టి20 అనుభవం ఉంది. బంగ్లాతో జాగ్రత్తగా ఉండాలని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఇప్పటికే జట్టు సభ్యులను హెచ్చరించాడు. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ధోని సేనను అప్రమత్తం చేశాడు. దీంతో ఇరు జట్ల ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.



భారత జట్టు(అంచనా)



ఎంఎస్ ధోని(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవి చంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా



వాతావరణం,పిచ్..



బంగ్లాదేశ్-భారత్ జట్ల మధ్య జరిగే తొలి పోరులో ఏదొక దశలో వర్షం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడకపోవచ్చు. ఈ టోర్నీ ఆద్యంతం జరిగే షేరే బంగ్లా స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదటి బ్యాటింగ్ తీసుకునే ఆస్కారం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top