‘సిక్సర్‌’పై టీమిండియా దృష్టి

India Eye Sixth Consecutive T20I Series Win Against Resurgent Hosts in Bristol - Sakshi

బ్రిస్టల్‌: మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా-ఇంగ్లండ్‌ జట్లు తలో మ్యాచ్‌ గెలవడంతో చివరిదైన నిర్ణయాత‍్మక మ్యాచ్‌పై ఇరు జట్లు దృష్టి సారించాయి. ఒకవైపు ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా, సొంత గడ్డపై సిరీస్‌ను కోల్పోకూడదనే భావనలో ఇంగ్లండ్‌ ఉంది. దాంతో బ్రిస్టల్‌ వేదికగా సాయంత్రం గం. 6.30ని.లకు ఇరు జట్ల మధ్య ఆరంభం కానున్న మూడో టీ20 ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

తొలి టీ20లో టీమిండియా గెలవగా, రెండో టీ20లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. దాంతో ఆఖరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు కోహ్లి గ్యాంగ్‌, మోర్గాన్‌ బృందం తహతహలాడుతున్నాయి. ఈ రోజు జరిగే మూడో టీ20లో టీమిండియా గెలిస్తే వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను సాధించినట్లవుతుంది.  గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత్‌.. ఆపై ఇప్పటివరకూ పొట్టి ఫార్మాట్‌లో సిరీస్‌ను కోల్పోలేదు. న్యూజిలాండ్‌పై సిరీస్‌ సాధించిన తర్వాత.. శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై సైతం సిరీస్‌లను చేజిక్కించుకుంది. ఆపై శ్రీలంకలో జరిగిన నిదాహాస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ను కూడా గెలవగా, ఇటీవల ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ చేసింది.

తొలి మ్యాచ్‌లో సూపర్‌ హిట్టయిన కుల్దీప్‌కు రెండో మ్యాచ్‌ నిరాశనే మిగిల్చింది. అతను ఒక వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. చహల్‌ ఒకటే వికెట్‌ తీసి పరుగులు బాగానే సమర్పించున్నాడు. బుమ్రా స్థానంలో ఆడుతున్న ఉమేశ్‌ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు. కానీ పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాడు. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ టచ్‌లోకి రావడంతో భారత్‌కు కష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో బౌలర్లు వైవిధ్యంపై దృష్టిసారిస్తేనే ఫలితాలు రాబట్టుకోవచ్చు. బ్యాటింగ్‌ విషయానికొస్తే కుల్దీప్‌లాగే రాహుల్‌ పరిస్థితి ఉంది. మాంచెస్టర్‌లో ‘శత’క్కొట్టేసిన ఈ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కార్డిఫ్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లూ చేతులెత్తేయడంతో మిడిలార్డర్‌పై భారం పెరిగింది. అయితే సిరీస్‌ను తేల్చే ఈ మ్యాచ్‌లో రోహిత్, ధావన్‌లు తమ ప్రభావం చూపిస్తే పరుగుల ప్రవాహానికి అడ్డు ఉండదు. ప్రత్యర్థి జట్టు సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌లో బట్లర్, రాయ్, హేల్స్, బెయిర్‌ స్టో ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రసవత్తరపోరు ఖాయంగా కనబడుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top