ఈ విజయం నిలవాలి

India continues third test match victory - Sakshi

వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి... అన్ని వైపుల నుంచి విమర్శల వర్షం. పూర్తిగా నిరుత్సాహం కమ్మేసిన ఇలాంటి పరిస్థితుల్లో విజయం సంగతి దేవుడెరుగు? సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుని బయటపడినా అదే పదివేలు. కానీ, మూడో టెస్టులో విరాట్‌ కోహ్లి సేన అద్భుతమే చేసింది. కనీసం పోటీ అయినా ఇస్తారా? అనే దశ నుంచి... ప్రత్యర్థితో తమకు పోటీనే లేదన్నట్లు ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక చేయాల్సింది... ఇదే ఊపును నాలుగో టెస్టు వేదిక సౌతాంప్టన్‌లోనూ కొనసాగించడం. చివరి టెస్టులోనూ ఆ పట్టు జారకుండా చూసుకోవడం! ఒకింత కష్టమే అయినా, ఈ రెండూ చేస్తే చరిత్రాత్మక గెలుపుతో రికార్డులకు ఎక్కుతుంది.   విదేశీ పర్యటనలో అత్యంత గడ్డు కాలంలో ఉన్న జట్టుకు ఎలాంటి విజయం కావాలో అలాంటిదే నాటింగ్‌హామ్‌లో భారత జట్టుకు దక్కింది. ఆ లెక్క చూస్తే ఒకటా? రెండా? మూడో టెస్టులో భారత్‌కు అన్నీ సానుకూలాంశాలే. ఓపెనర్లు క్రీజులో నిలిచారు... మిడిలార్డర్‌ రాణించింది... ఆల్‌రౌండర్‌ మెరిశాడు... లోయర్‌ ఆర్డర్‌ తమవంతు చెయ్యేసింది... పేసర్లు ప్రతాపం చూపారు. వెరసి, టీమిండియాది ఆల్‌రౌండ్‌ విజయం. మ్యాచ్‌ ముగిశాక బహుమతి ప్రదానోత్సవంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం సరిగ్గా ఇదే మాట చెప్పడం గమనార్హం. ఆటగాళ్లందరూ తమవంతు పాత్ర పోషించడంతో వచ్చిన ఈ ఫలితం... కోహ్లి సేన ఆత్మవిశ్వాసాన్ని అమితంగా పెంపొందించి ఉంటుందనడంలో సందేహం లేదు. 

ఫలించిన నిర్ణయాలు... 
‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం చర్చించుకున్నామో అదే మాకు ముఖ్యం. బయటి విషయాలు అనవసరం’... మ్యాచ్‌ అనంతరం కోహ్లి చేసిన వ్యాఖ్యలివి. ఓటముల అనంతరం కూడా ‘మన ఆట మనం ఆడదాం. ఫలితం ఏదైనా ఎదుర్కొందాం’ అనే జట్టు మానసిక స్థితికి ఇవి అద్దం పట్టాయి. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు కలిసొచ్చాయి. అందులో ముఖ్యమైనది ఓపెనర్‌ మురళీ విజయ్‌ను తప్పించడం. టెక్నిక్, మెరుగైన విదేశీ రికార్డు కారణంగా అతడిని చాలాకాలంగా కొనసాగిస్తున్నారు. కానీ, ఎంతకూ మెరుగుపడకపోవడంతో మరో ఆలోచన లేకుండా పక్కన పెట్టారు. విధి లేని ఈ పరిస్థితుల్లో ధావన్‌ను నమ్ముకున్నారు. ఉమేశ్‌ కాకుండా మూడో పేసర్‌గా వైవిధ్యమైన యాక్షన్‌ ఉన్న బుమ్రాను ఎంచుకోవడమూ సరైనదే.  

బ్యాట్స్‌మెన్‌ కుదురుకున్నారు... 
ధావన్, రాహుల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ శతక భాగస్వామ్యాలతో శుభారంభం అందించడం, వైస్‌ కెప్టెన్‌ రహానే ఫామ్‌లోకి రావడం, అడ్డుగోడ పుజారా తనదైన శైలిలో నిలదొక్కుకోవడం, ఎప్పటిలానే సాగిన సారథి కోహ్లి దీటైన ఆట బ్యాటింగ్‌పరంగా మన జట్టు పైచేయి సాధించేలా చేశాయి. అన్నింటికి మించి పుజారా, రహానే క్రీజులో ఎక్కువసేపు గడపడం కీలకాంశం. ఇక హార్దిక్‌ పాండ్యా ప్రదర్శన (ఐదు వికెట్లు, అర్ధ సెంచరీ) ఆల్‌రౌండర్‌ పదానికి అర్హుడా? కాదా? అనే చర్చకు తెరదించింది. తొలి ఇన్నింగ్స్‌లో అతడి మెరుపు స్పెల్‌... టెస్టును భారత్‌ వైపు తిప్పింది. రెండో ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ భాగస్వామ్యంతో కలవరపెడుతున్న స్టోక్స్‌ను ఔట్‌ చేసిన బంతి అచ్చమైన టెస్టు బంతి. ఇషాంత్, షమీ తమ వాడి చూపగా... గాయం నుంచి కోలుకున్న బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. రిషభ్‌ పంత్‌ అరంగేట్రంలోనే అటు బ్యాట్‌తో, ఇటు కీపింగ్‌లో ఐదు క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా భారత స్లిప్‌ క్యాచింగ్‌ అత్యద్భుతంగా సాగింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి, రాహుల్‌ అందుకున్న మెరుపు క్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. వీటితోపాటు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడం, ఎడమచేతి వాటం స్యామ్‌ కరన్‌ను పక్కన పెట్టడం వంటి రూట్‌ నిర్ణయాలు కూడా భారత్‌కు కలిసొచ్చాయి. అయినా, ఇవికాక మైదానంలో ఏ విధంగా చూసినా ఆతిథ్య జట్టు కంటే కోహ్లి సేన అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. 
– సాక్షి క్రీడా విభాగం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top