వారెవ్వా టీమిండియా..

India beat Australia by 8 Runs 2nd Odi - Sakshi

నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియానే విజయం సాధించింది. ఆసీస్‌ను 242 పరుగులకు కట్టడి చేసిన భారత్‌ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌ ఆటగాళ్లలో పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(48), స్టోయినిస్‌(52), ఖవాజా(38), అరోన్‌ ఫించ్‌(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. చివరి ఆరు ఓవర్లో ఆసీస్‌ విజయానికి 38 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. దాంతో ఆసీస్‌ విజయం లాంఛనమే అనుకున‍్నారంతా. ఆ తరుణంలో విజృంభించిన భారత బౌలర్లు వరుసగా వికెట్లు కూల్చి అద్భుతమైన విజయాన్ని అందించారు. 45 ఓవర్‌లో అలెక్స్‌ క్యారీని కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేయగా,  బుమ్రా వేసిన 46 ఓవర్‌లో కౌల్టర్‌ నైల్‌, ప్యాట్‌ కమిన్స్‌లు పెవిలియన్‌ బాట పట్టారు. ఇక చివరి ఓవర్‌లో స్టోయినిస్‌,  జంపాలను ను విజయ్‌ శంకర్‌ ఔట్‌ చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, విజయ్‌ శంకర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  కోహ్లి(116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి జతగా, విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోవడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. అయితే రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆపై ధావన్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్‌(21) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడుతో కలిసి కోహ్లి మరో 37 పరుగులు జత చేశాడు. కాగా, రాయుడు(18) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు.

ఆ తరుణంలో కోహ్లి-విజయ్‌ శంకర్‌ జంట ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా, విజయ్‌ శంకర్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత కేదార్‌ జాదవ్‌(11), ఎంఎస్‌ ధోని(0)  వెనువెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది. కాగా, ఆ సమయంలో కోహ్లితో జత కలిసిన రవీంద్ర జడేజా కదురుగా బ్యాటింగ్‌ చేశాడు. మరొకవైపు కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు 55 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరిన కోహ్లి దాన్ని సెంచరీగా మలచుకున్నాడు. ఇది కోహ్లి వన్డే కెరీర్‌లో 40 సెంచరీ.  అయితే రవీంద్ర జడేజా(21) ఏడో వికెట్‌ ఔటైన కాసేపటికి కోహ్లి కూడా నిష్క్రమించాడు. దాంతో 248 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. మరొక పరుగు వ్యవధిలో కుల్దీప్‌ యాదవ్‌(3) నిష్క్రమించాడు. ఇక చివరి వికెట్‌గా బుమ్రా డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో భారత్‌ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌ నాలుగు వికెట్లు సాధించగా, జంపా రెండు వికెట్లు తీశాడు. కౌల్టర్‌ నైల్‌, మ్యాక్స్‌వెల్‌, లయన్‌లు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top