టీమిండియాదే తొలి వన్డే

India beat Australia by 6 Wickets - Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ(37), విరాట్‌ కోహ్లి(44), ఎంఎస్‌ ధోని(59 నాటౌట్‌), కేదర్‌ జాదవ్‌(81 నాటౌట్‌)లు రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో భారత్‌ ఆదిలోనే శిఖర్ ధావన్‌ వికెట్‌ను నష్టపోయింది. ధావన్‌ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆపై రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించిన తర్వాత కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ఇక రోహిత్‌ శర్మ కౌల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.  దాంతో 15 పరుగుల వ్యవధిలో భారత్ రెండు ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. కాగా, ధోని-జాదవ్‌ల జోడి సమయోచితంగా ఆడటంతో భారత్‌ విజయం ఖాయమైంది. వీరిద్దరూ 141 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్‌ 48.2 ఓవర్లలో విజయం చేజిక్కించుకుంది.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.  ఆస్ట్రేలియా టాపార్డర్‌ ఆటగాళ్లలో ఉస్మాన్‌ ఖవాజా(50), మ్యాక్స్‌వెల్‌(40)లు రాణించగా, స్టోయినిస్‌(37) ఓ మోస్తరుగా ఆకట్టుకోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖవాజా-స్టోయినిస్‌ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. వీరిద‍్దరూ 87 పరుగులు జత చేసిన తర్వాత స్టోయినిస్‌(37) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆపై కాసేపటికి హాఫ్‌ సెంచరీ సాధించిన ఖావాజా సైతం పెవిలియన్ బాట పట్టాడు. కాగా, హ్యాండ్స్‌ కాంబ్‌-మ్యాక్స్‌వెల్‌ జంట 36 పరుగులు జోడించింది. నాల్గో వికెట్‌గా హ్యాండ్స్‌ కోంబ్‌(19) ఔట్‌ కాగా, ఐదో వికెట్‌గా టర్నర్‌(21) పెవిలియన్‌ చేరాడు. ఇక కుదరుగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ను షమీ బోల్తా కొట్టించాడు. చివర్లో కౌల్టర్‌ నైల్‌(28), అలెక్స్‌ క్యారీ(36 నాటౌట్‌)లు జాగ్రత్తగా ఆడటంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా, కేదర్‌ జాదవ్‌కు వికెట్ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top