ఆరంభం అదిరేనా! 

India-Australia 1st test to begin Thursday, teams announced - Sakshi

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు

చరిత్ర సృష్టించే లక్ష్యంతో టీమిండియా

సొంతగడ్డపై సత్తా చాటాలని కంగారూలు 

రోహిత్, విహారిలలో ఒకరికే చాన్స్‌ 

ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడూ గెలవలేరు... తొలిసారి సిరీస్‌ విజయం సాధించేందుకు ఇదే మంచి అవకాశం... ప్రత్యర్థి బలహీనంగా ఉంది... భారత జట్టు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడం చాలా అరుదు. కానీ ఈసారి ఆస్ట్రేలియాతో పోరుకు ముందు మాత్రం టీమిండియాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆటగాళ్లంతా తమ సత్తా చాటి వాటిని నిజం చేసే సమయం వచ్చింది. మరోవైపు బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం తర్వాత తొలిసారి సొంతగడ్డపై టెస్టు ఆడుతున్న కంగారూలు విజయంతో పాటు స్వదేశంలో కొంత గౌరవాన్ని కూడా పొందాలని పట్టుదలగా ఉన్నారు. పోలికల్లో భారత్‌లోని పిచ్‌ను తలపిస్తున్న అడిలైడ్‌ మైదానంలో ఇరు జట్లు ఒక్కో స్పిన్నర్‌నే నమ్ముకున్నాయి. భారీ స్కోరుతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండటంతో బ్యాటింగ్‌ బలగాన్నే పటిష్ట పర్చుకున్నాయి. కోహ్లికి అచ్చొచ్చిన మైదానంలో మన  జట్టు విజయాన్ని అందుకుంటుందా లేక గెలుపుతో ప్రత్యర్థి శుభారంభం చేస్తుందా చూడాలి.  

అడిలైడ్‌: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో విదేశీ పర్యటనల విషయంలో తీవ్రంగా చర్చ జరిగింది. ఒకే సంవత్సరం మూడు పెద్ద జట్లతో సిరీస్‌లు ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లికి పరీక్ష పెట్టాయి. అయితే బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించిన విరాట్‌... కెప్టెన్‌గా మాత్రం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో విఫలమయ్యాడు. ఇప్పుడు మరో అవకాశం అతడి ముందు నిలిచింది. నాలుగేళ్ల క్రితం తన కెరీర్‌కు కొత్త ఊపిరి పోసిన గడ్డపై అతను మరోసారి బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ)కి భారత్‌ సిద్ధమైంది. నేటి నుంచి జరిగే తొలి టెస్టులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్‌ భావిస్తోంది. అయితే స్వదేశంలో తమ రికార్డును కాపాడుకునేందుకు ఆసీస్‌ సేన కూడా సర్వశక్తులూ ఒడ్డనుంది.  

అశ్విన్‌కే చాన్స్‌... 
మ్యాచ్‌కు ముందు రోజు భారత్‌ 12 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో ఒకే స్పిన్నర్‌ అశ్విన్‌కు చోటు లభించింది. కుల్దీప్, జడేజాలతో పాటు పేసర్లలో భువనేశ్వర్, ఉమేశ్‌లకు అవకాశం దక్కలేదు. ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌ చేయాలంటే బౌలర్లే ప్రధానం అంటూ గతంలో చాలా సార్లు ఐదుగురు బౌలర్లతో దిగిన సూత్రాన్ని కోహ్లి ఈసారి పక్కన పెట్టాడు. గత సిరీస్‌లో బ్యాటింగ్‌ వైఫల్యాల నేపథ్యంలో ముందు బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధిస్తేనే బౌలర్లకూ అవకాశం ఉంటుందని భారత్‌ భావిస్తోంది. అందుకే ఆరుగురు రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్‌కు చోటు కల్పించింది. ఐదుగురి స్థానం ఖాయం కాగా, ఆరో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ, హనుమ విహారిలలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంది. పార్ట్‌టైమ్‌ స్పిన్‌తో బౌలర్లకు కొంత విశ్రాంతినివ్వాలంటే విహారికి అవకాశం ఉంటుంది. ఒక దూకుడైన బ్యాట్స్‌మన్‌ను కోరుకుంటే రోహిత్‌ వైపు మొగ్గు ఉంటుంది. కానీ అతని టెస్టు ఆటపై ఇంకా సందేహాలు ఉన్నాయి. అయితే అసలు సమస్య కోహ్లి తప్ప మిగిలిన నలుగురు బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ కూడా అంత గొప్పగా కనిపించడం లేదు. పృథ్వీ షా గాయం కారణంగా ఓపెనర్లుగా విజయ్, రాహుల్‌ ఖాయమయ్యారు. ఓవల్‌ టెస్టు చివరి ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే విదేశాల్లో గత 9 ఇన్నింగ్స్‌లలో కలిపి రాహుల్‌ 150 పరుగులే చేశాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌ మధ్యలోనే చోటు కోల్పోయిన విజయ్‌ తాజాగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించడం కొంత సానుకూలాంశం. ఇంగ్లండ్‌ పర్యటనలో పుజారా, రహానే ప్రదర్శన కూడా సాధారణంగానే ఉంది. ఇలాంటి స్థితిలో కోహ్లి మాత్రమే ఆడితే సరిపోదు. మరో బ్యాట్స్‌మన్‌ సహకారం ఉంటేనే భారత్‌ భారీ భాగస్వామ్యాలతో విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. గత టూర్‌లో ఇదే మైదానంలో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ముగ్గురు పేసర్లలో ఇషాంత్‌ అత్యంత అనుభవజ్ఞుడు కాగా, షమీ కూడా గత సిరీస్‌ ఆడాడు. బుమ్రా తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు ఆడబోతున్నాడు. అయితే అతని భిన్నమైన బౌలింగ్‌ ప్రత్యర్థికి సవాల్‌ విసిరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసీస్‌ ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను బుమ్రా ఇబ్బంది పెట్టగలడు. సీనియర్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌నే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మింది కాబట్టి దానిని అతను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై 6 టెస్టుల్లో కలిపి 54.71 సగటుతో కేవలం 21 వికెట్లతో పేలవ రికార్డు ఉన్న అశ్విన్‌ ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం.  

మిషెల్‌ మార్‌‡్ష ఔట్‌..
ఆస్ట్రేలియా జట్టు సరిగ్గా భారత్‌ తరహాలోనే తుది జట్టును ఎంపిక చేసింది. వార్నర్, స్మిత్‌ దూరమైన నేపథ్యంలో బ్యాటింగ్‌ను పటిష్ట పర్చుకోవడమే సరైన ఆలోచనగా మేనేజ్‌మెంట్‌ భావించింది. ఆరుగురు రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో జట్టు బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్‌‡్షను తప్పించి అతని స్థానంలో హ్యాండ్స్‌కోంబ్‌ను టీమ్‌లోకి తీసుకుంది. మార్కస్‌ హారిస్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనుండగా, యూఏఈలో రాణించిన ఫించ్‌ మరో ఓపెనర్‌గా ఆడతాడు. ఆసీస్‌ విజయావకాశాలను ప్రభావితం చేసే ఉస్మాన్‌ ఖాజా మూడో స్థానంలోకి బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్‌లో షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, హెడ్‌లు ఎలా రాణిస్తారనేది కీలకం.  తమ పేస్‌ దళంపై కంగారూలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారత బ్యాటింగ్‌కు కుప్పకూల్చగల సత్తా స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌లకు ఉందని జట్టు నమ్ముతోంది. ఈ ముగ్గురు కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో సిరీస్‌కు సిద్ధమై వచ్చారు. ఏకైక స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌పై ఎక్కువ బాధ్యత ఉంది. భారత బ్యాట్స్‌మెన్‌కు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటారనే పేరున్నా లయన్‌ మనల్ని గతంలో చాలా ఇబ్బంది పెట్టాడు. పిచ్‌లు పెద్దగా అనుకూలించకపోయినా సొంతగడ్డపై అతనికి మంచి రికార్డు ఉండటం భారత్‌కు సవాల్‌ విసురుతోంది.
  
తుది జట్ల వివరాలు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), విజయ్, రాహుల్, పుజారా, రహానే, రోహిత్‌/విహారి, పంత్, అశ్విన్, షమీ, బుమ్రా, ఇషాంత్‌. 
ఆస్ట్రేలియా: పైన్‌ (కెప్టెన్‌), హారిస్, ఫించ్, ఖాజా, షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, ట్రవిస్‌ హెడ్, లయన్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌. 

పిచ్, వాతావరణం 
పిచ్‌ పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది. ఆట సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలంగా మారు తుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేస్తే మ్యాచ్‌ను శాసించే అవకాశం ఉంటుంది కాబట్టి టాస్‌ కీలకం కానుంది. తీవ్రమైన ఎండలు ఉండటంతో వర్షం సమస్య కూడా లేదు.  

టెస్టులో విజయంతో పాటు మా దేశ అభిమానుల మనసులు గెలుచుకోవడం కూడా మాకు ముఖ్యం. ఈ రెండూ జరుగుతాయని ఆశిస్తున్నా. జట్టులో కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. నలుగురు బౌలర్ల వ్యూహం సరైందే. ముగ్గురు పేసర్లు అలసిపోతారని భావించడం లేదు. ఒక రోజులో సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు వేయగలడని నాథన్‌ లయన్‌పై మాకు నమ్మకముంది. ప్రత్యర్థి జట్టులో ఏకైక స్పిన్నర్‌ను ఇరు జట్లు లక్ష్యంగా చేసుకుంటాయని తెలుసు. ఈ పోరు ఎలా సాగుతుందో చూడాలి.
 - టిమ్‌ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్‌  

అన్ని వైపుల నుంచి నాపైనే దృష్టి ఉందనే విషయాన్ని నేను నమ్మను. నా గురించి మాట్లాడవద్దని, రాయవద్దని నేను బయటి వ్యక్తులకు చెప్పలేను. అయితే మాలో ప్రతీ బ్యాట్స్‌మన్‌కు జట్టును గెలిపించగల సత్తా ఉంది. ప్రత్యర్థి బలహీనతలకంటే మా బలంపైనే దృష్టి పెట్టాం. ఎలాంటి ఉదాసీనతకు చోటివ్వం. ఇటీవల చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడటమే ముఖ్యం. ఇక్కడి మైదానంలో పరుగులు సాధించాననే కాకుండా వ్యక్తిగతంగా కూడా భారత్‌ బయట నాకు అడిలైడ్‌ ఇష్టమైన నగరం. సొంతగడ్డపై ఏ జట్టు కూడా బలహీనమైంది కాదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టం. స్లెడ్జింగ్‌ విషయంలో గతంలో ఇరు జట్లు హద్దులు దాటిన మాట వాస్తవమే. అయితే గీత దాటకుండా నిబంధనలకు లోబడి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే అందరూ చూస్తారు. అయితే కేవలం మైదానంలోకి వచ్చి ఆడి మాత్రమే వెళ్లిపోతే అంతా నిస్సారంగా ఉంటుంది కదా. 
 –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌ 

►1  ఈ మైదానంలో 11 టెస్టులు ఆడిన భారత్‌ 1 గెలిచి 7 ఓడింది. మరో 3 ‘డ్రా’గా ముగిశాయి. 2003–04 సిరీస్‌లో ఇక్కడ భారత్‌ 4 వికెట్లతో మ్యాచ్‌ నెగ్గింది.  

►3 కెరీర్‌లో తన తొలి టెస్టు సెంచరీని (2012) ఇక్కడే సాధించిన కోహ్లి, గత టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో మరో రెండు శతకాలు బాదాడు.  

►5 ఆస్ట్రేలియా గడ్డపై 44 టెస్టులు ఆడిన భారత్‌ కేవలం 5 మాత్రమే గెలిచింది.   28 టెస్టుల్లో ఓడిపోయి 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top