‘నాడా’కు షాకిచ్చారు!

India anti-doping lab banned by Wada - Sakshi

ల్యాబ్‌ను సస్పెండ్‌ చేసిన ‘వాడా’

నాణ్యతా ప్రమాణాలు లేవంటూ ప్రకటన 

న్యూఢిల్లీ: భారత క్రీడాకారులకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించే జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పనితీరును ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ప్రశ్నించింది. ‘నాడా’కు చెందిన ల్యాబ్‌ (ఎన్‌డీటీఎల్‌)లో ప్రమాణాలు బాగా లేవంటూ ఆరు నెలల పాటు గుర్తింపును రద్దు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది కూడా సమయం లేని నేపథ్యంలో సొంత డోపింగ్‌ సంస్థపై నిషేధం ‘నాడా’ను ఇబ్బంది పరిచే అంశం. ‘ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఫర్‌ ల్యాబొరేటరీస్‌ (ఐఎస్‌ఎల్‌) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ వేదికలో  సౌకర్యాలు లేవని ‘వాడా’ పరిశీలనలో తేలింది.

అందుకే ఈ ల్యాబ్‌ గుర్తింపు రద్దు చేస్తున్నాం’ అని ‘వాడా’ ప్రకటించింది. తమ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇది జరిగినట్లు కూడా వెల్లడించింది. 20 ఆగస్టు, 2019 నుంచి ఎన్‌డీటీఎల్‌పై సస్పెన్షన్‌ వర్తిస్తుంది. ఇకపై అన్ని రకాల పరీక్షలు నిలిపేయాల్సిందిగా కూడా ‘వాడా’ ఆదేశించింది. అయితే శాంపిల్‌ను తీసుకునే అవకాశం మాత్రం ‘నాడా’కు ఉంది. వాటిని తాము పరీక్షించకుండా ఇతర గుర్తింపు పొందిన సంస్థకు పంపించాల్సి ఉంటుంది.

తాజా చర్యపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిటేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో 21 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే అవకాశం ఎన్‌డీటీఎల్‌కు ఉంది. ఒలింపిక్‌ ఏడాది కావడంతో కనీసం 5000కు పైగా డోపింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న ‘నాడా’ ఇప్పుడు ఆ పరీక్షలను బయట జరిపితే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ‘నాడా’పై సస్పెన్షన్‌ విధించడం పట్ల కేంద్ర క్రీడా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. దీని వెనక ‘వాడా’ వాణిజ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్‌ జులనియా అన్నారు. ‘వాడా’ నిర్ణయంపై సీఏఎస్‌లో అప్పీల్‌ చేస్తామని రాధేశ్యామ్‌ తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top