రోహిత్‌ ‘టాప్‌’ లేపాడు..

 Ind vs WI: Rohit Sharma Slams Century Against West Indies - Sakshi

విశాఖ: వెస్టిండీస్‌తో ఇక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌లు సెంచరీల మోత మోగించారు. తొలుత రోహిత్‌ శర్మ సెంచరీతో మెరవగా, రాహుల్‌ కూడా శతకాన్ని నమోదు చేశాడు. ఇది రోహిత్‌కు 28 వన్డే సెంచరీ కాగా, రాహుల్‌కు 3 వన్డే  సెంచరీ. ఈ క్రమంలోనే వీరిద్దరూ  రెండొందల పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో తొలిసారి ఈ జోడి అత్యధిక ఓపెనింగ్‌  పరుగుల మార్కును  చేరింది. ఇప్పటివరకూ వీరిద్దరి ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యం 189 పరుగులగా ఉండగా దాన్ని  తాజాగా అధిగమించారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్‌-రాహుల్‌ ఆరంభించారు. ఆది నుంచి సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముందుగా రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేసుకోగా, అటు తర్వాత రోహిత్‌ అర్థ శతకం చేశాడు. 46 బంతుల్లో రాహుల్‌ అర్థ శతకం సాధించగా, రోహిత్‌  హాఫ్‌ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్నాడు. అటు  తర్వాత రోహిత్‌ రెచ్చిపోయి ఆడాడు.ఇక్కడ రోహిత్‌ హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచుకోవడానికి 40 బంతులు తీసుకోగా, రాహుల్‌ అర్థ శతకాన్ని శతకంగా మార్చుకోవడానికి మరో 56 బంతులు తీసుకున్నాడు.  రోహిత్‌ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించగా, రాహుల్‌ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం నమోదు చేశాడు.37 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 227 పరుగులు చేసింది. 102 వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

ఈ ఏడాది రోహితే టాప్‌..
విండీస్‌తో రెండో వన్డేలో శతకం సాధించడం ద్వారా రోహిత్‌ శర్మ ఒక రికార్డును నమోదు చేశాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డు సాధించాడు. ఈ ఏడాది రోహిత్‌ సాధించిన వన్డే సెంచరీలు 7. అయితే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్‌ నాల్గో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(9-1998లో), సౌరవ్‌ గంగూలీ(7- 2000లో), డేవిడ్‌ వార్నర్‌(7-2016లో)లు తొలి మూడు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని రోహిత్‌ ఆక్రమించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top