శాంసన్‌కు నో ఛాన్స్‌.. అగర్వాల్‌కు అవకాశం

IND VS WI ODI Series: Agarwal Named Dhawans Replacement - Sakshi

ముంబై: అందరూ ఊహించినట్టే జరిగింది. గాయపడిన శిఖర్‌ ధావన్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌నే సెలక్టర్లు ఎంపిక చేశారు. మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌కు దూరమైన ధావన్‌ స్థానంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అయితే ధావన్‌ గాయం నుంచి కోలుకోని పక్షంలో వన్డే సిరీస్‌కు కూడా శాంసన్‌నే తిరిగి ఎంపిక చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ కేరళ క్రికెటర్‌ ఆశలు ఆవిరయ్యాయి. 

రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో, ప్రత్యామ్నాయ ఓపెనర్‌ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. దీంతో కర్ణాటక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ ఒక్కటి మినహా టీమిండియా వన్డే జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.  మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఈనెల 15న చెన్నైలో... రెండో వన్డే 18న విశాఖపట్నంలో... మూడో వన్డే 22న కటక్‌లో జరుగుతాయి.

అయితే వన్డే సిరీస్‌కు శాంసన్‌ను ఎంపిక చేస్తే తప్పక తుది జట్టులో ఆడే అవకాశం దక్కేదని క్రీడా పండితులు భావించారు. ఎందుకంటే టీ20తో పోలిస్తే వన్డేల్లో విండీస్‌ చాలా బలహీనమైన జట్టు, దీంతో ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక మయాంక్‌ అగర్వాల్‌ ఈ ఏడాది టెస్టుల్లో అదరగొడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై ద్విశతకంతో అదరగొట్టిన ఈ యంగ్‌ క్రికెటర్‌.. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌లోనూ ద్విశతకంతో మెరిశాడు. 

ప్రపంచకప్‌లో విజయ్‌ శంకర్‌ స్థానంలో టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ లక్కీ క్రికెటర్‌ మరోసారి గాయం కారణంగానే వన్డే జట్టులోకి రావడం గమనార్హం.  ఇక ధావన్‌కు కూడా ఈ ఏడాది కలిసి రావడం లేదు. తరుచూ గాయపడుతున్నాడు. కీలక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా గాయానికి గురై ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక గాయం నుంచి కోలుకోని తిరిగి ఫామ్‌ను అందుకుంటాడనుకున్న తరుణంలో మరోసారి గాయ పడటం ధావన్‌తో పాటు బీసీసీఐ వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి.  

భారత వన్డే జట్టు: 
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top