ఈ సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిస్తే.. నేను రిటైర్డ్‌!

IND Vs NZ: Three New Zealand Defeats And The Same Commentator - Sakshi

హామిల్టన్‌: ఇప్పటివరకూ న్యూజిలాండ్‌ ఏడుసార్లు సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు(టీ20లు, వన్డేలు కలిపి) ఆడగా అందులో ఆరుసార్లు ఆ జట్టును పరాజయమే వెక్కిరించింది. టీ20ల్లో ఐదుసార్లు, వన్డేల్లో ఒకసారి కివీస్‌ సూపర్‌ ఓవర్‌లో చతికిలబడింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా, దాన్ని కూడా కివీస్‌ టై చేసుకుంది. దాంతో ఓవరాల్‌ బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ కప్‌ను ఎగరేసుకుపోగా, న్యూజిలాండ్‌ మెగా కప్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత నవంబర్‌లో ఇంగ్లండ్‌తోనే జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్‌ కూడా కివీస్‌కు కలిసి రాలేదు. ఆ ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లగా అందులో ఇంగ్లండ్‌ స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఆపై మళ్లీ టీమిండియాతో టీ20 మ్యాచ్‌ ఆడిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో కివీస్‌ పరాజయం పాలైంది. ఈ మూడు సూపర్‌ ఓవర్‌ సందర్భాల్లోనూ కివీస్‌ ఒక వరల్డ్‌కప్‌తో పాటు రెండు సిరీస్‌లను కోల్పోయింది.(ఇక్కడ చదవండి: టీమిండియా సరికొత్త రికార్డు)

గత ఏడు నెలల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కివీస్‌ మూడు సూపర్‌ ఓవర్ల మ్యాచ్‌లు ఆడి పరాజయం పాలవడం ఒకటైతే, ఇక్కడ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ మూడు సందర్భాల్లోనూ న్యూజిలాండ్‌ తరఫున కామెంటరీ బాక్స్‌లో ఉన్నది ఇయాన్‌ స్మిత్‌ కావడం విశేషం. న్యూజిలాండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ అయిన ఇయాన్‌ స్మిత్‌.. వరుసగా కివీస్‌ ఓడిపోయిన మూడు సూపర్‌ ఓవర్ల మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించాడు. బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడంతో స్మిత్‌ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘న్యూజిలాండ్‌ ఆడిన గత మూడు సూపర్‌ మ్యాచ్‌ల్లో నేను కామెంటేటర్‌గా ఉన్నా. ఈ సమయంలో నా జీవితాన్ని కోల్పోయాననే అనుకుంటున్నా. ఈ మ్యాచ్‌ కూడా టైగా ముగిస్తే నేను రిటైర్డ్‌ అయిపోయినట్లే. కానీ సూపర్‌ ఓవర్‌ను నేను ప్రేమిస్తా.. కచ్చితంగా ప్రేమిస్తా’ అని ఇయాన్‌ స్మిత్‌ కామెంటేటర్‌గా నవ్వులు పూయించాడు. (ఇక్కడ చదవండి: ‘సూపర్‌’ మ్యాచ్‌: గెలిపించినోడే హీరో)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top