టీమిండియా మరో బిగ్‌ విక్టరీ

Ind Vs Ban: Team India Dismantle Bangladesh For Innings Win - Sakshi

ఇండోర్‌:  టీమిండియా ప్రత్యర్థి మారినా ఫలితంలో మాత్రం తేడా ఉండటం లేదు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభమైన తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభపు టెస్టులో భారీ విజయం సాధించి శుభారంభం చేసింది. బంగ్లాతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో జయభేరీ మోగించింది.

బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్‌ చేసి భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్ఫికర్‌ రహీమ్‌(64) మినహా ఎవరూ రాణించలేదు.భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను మూడో రోజే ముగించింది.  భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు సాధించగా, అశ్విన్‌ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు, ఇషాంత్‌కు వికెట్‌ లభించింది.

శనివారం ఆటలో భాగంగా 493/6 ఓవర్‌నైట్‌ స్కోరు వద్ద భారత్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అటు తర్వాత కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(7), మహ్మద్‌ మిథున్‌(18)లు సైతం నిరాశపరచడంతో బంగ్లా తేరుకోలేకపోయింది. కాగా, ముష్ఫికర్‌ రహీమ్‌ ప్రతిఘటించడంతో బంగ్లా గాడిలో పడినట్లు కనిపించింది. ఒకవైపు ముష్పికర్‌ ఆడినా మరొకవైపు వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముష్పికర్‌ రహీమ్‌ తర్వాత  లిటాన్‌ దాస్‌(35), మెహిదీ హసన్‌(38)లు మాత్రమే మోస్తరుగా ఆడారు. రహీమ్‌ 9వ వికెట్‌గా పెవిలియన్‌ చేరిన కాసేపటికే బంగ్లా కథ ముగిసింది. బంగ్లా ఆఖరి వికెట్‌గా ఎబాదత్‌ హుస్సేన్‌ ఔట్‌ కావడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది.

మూడోసారి హ్యాట్రిక్‌..
ఇన్నింగ్స్‌ విజయాలను వరుసగా మూడుసార్లు సాధించడం భారత క్రికెట్‌ చరిత్రలో మూడోసారి. బంగ్లాదేశ్‌తో తాజా టెస్టు మ్యాచ్‌కు ముందు పుణెలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రాంచీలో అదే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ విజయాన్ని అందుకుంది.  1992-93 సీజన్‌లో భారత్‌ ఇలానే వరుసగా మూడు ఇన్నింగ్స్‌ విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌పై రెండుసార్లు, జింబాబ్వేపై ఇన్నింగ్స్‌ విజయాల్ని నమోదు చేసింది. ఆపై 1993-94 సీజన్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ విజయాల్ని టీమిండియా సాధించింది.

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 150 ఆలౌట్‌( రహీమ్‌ 43); రెండో ఇన్నింగ్స్‌ 213 ఆలౌట్‌( రహీమ్‌ 64)
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 493/6 డిక్లేర్డ్‌(మయాంక్‌ అగర్వాల్‌ 243, పుజారా 54, రహానే 86, జడేజా 60)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top