భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌: టీ20 @1000

Ind Vs Ban: First T20I Create History - Sakshi

ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన పోరు అంతర్జాతీయ టి20ల్లో 1000వ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో  బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, 17 ఫిబ్రవరి, 2005న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య ఆక్లాండ్‌లో తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 44 పరుగులతో గెలిచింది.  రిఫరీగా రంజన్‌ మదుగలేకు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌. రోహిత్‌ శర్మ కెరీర్‌లో ఇది 99వ మ్యాచ్‌. ఎమ్మెస్‌ ధోని (98)ని అధిగమించి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా షాహిద్‌ అఫ్రిది (99)తో సమంగా నిలిచిన రోహిత్‌కంటే మలింగ (111) మాత్రమే ముందున్నాడు. ఈ మ్యాచ్‌తో మరోసారి కోహ్లి (2,450)ని దాటి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ (2,452) నిలిచాడు.   శివమ్‌ దూబే ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున టి20లు ఆడిన 82వ ఆటగాడిగా దూబే గుర్తింపు పొందాడు.  (ఇక్కడ చదవండి: టీమిండియాకు షాక్‌)

‘కాలుష్యం ఆటను ఆపలేదు’ ...
ఢిల్లీ ప్రభుత్వపు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆదివారం ఆరోగ్య సలహా సూచీని ప్రకటించింది. ఇందులో ‘అవుట్‌డోర్‌ కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇంట్లోనే ఉండండి’ అనేది మొదటి ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే అక్కడ అధికారికంగా పాఠశాలలు, కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. మ్యాచ్‌ ప్రారంభమైన 7 గంటల సమయంలో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. కానీ ఈ పొగమంచు కాలుష్యం క్రికెట్‌ మ్యాచ్‌కు మాత్రం అడ్డు కాలేదు. దాదాపు 25 వేల మంది ప్రేక్షకులు కాలుష్యాన్ని లెక్క చేయకుండా మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చారు. ఇందు లో పెద్ద సంఖ్యలో పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ ఐపీఎల్‌ వరకు మరో క్రికెట్‌ మ్యాచ్‌ లేదు కాబట్టి వచ్చామని, కాలుష్యం ఉన్నా తమ రొటీన్‌ పనులు చేసుకోవడం లేదా అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. మరోవైపు మైదానంలో కూడా ఆటగాళ్లు కూడా ఏ దశ లోనూ ఇబ్బంది పడినట్లుగా కనిపించలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top