బీసీసీఐతో వివాదంలో పీసీబీకి షాక్‌

ICC rejects Pakistans compensation claim against India - Sakshi

దుబాయ్: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)తో వివాదంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి షాక్‌ తగిలింది. తమతో ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించిందంటూ పీసీబీ చేసిన ఫిర్యాదును ఐసీసీ వివాదాల కమిటీ తిరస్కరించింది. ఈ మేరకు తన తుది తీర‍్పును మంగళవారం వెల్లడించింది.

రెండు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, అందువల్ల తమకు 7 కోట్ల డాలర్ల (సుమారు రూ.445 కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి  పీసీబీ  ఫిర్యాదు చేసింది. దీనిపై రెండు దేశాల బోర్డుల వాదనలు విన్న తర్వాత పీసీబీ వాదనను వివాదాల కమిటీ తోసిపుచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ తీర్పే ఫైనల్ అని, దీనిపై అప్పీల్ చేసే అవకాశం కూడా లేదని క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరు జట్ల మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాసుకున్న ఎమ్‌ఓయూ.. ఒక ప‍‍్రపోజల్‌ లెటర్‌ లాంటిదని బీసీసీఐ వాదించింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఆడతామనే వాదనను బలంగా వినిపించింది.

ఒప్పందం ఉల్లంఘన కారణంగా తమకు జరిగిన నష్టాన్ని పరిహారంతో పూడ్చాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే పీసీబీ డిమాండ్ చేసిన 445 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఐసీసీ వివాదాల కమిటీ తీర్పు చెప్పింది. అక్టోబర్ 1 నుంచి 3 మధ్య రెండు బోర్డులు తమ వాదనలు వినిపించాయి. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో రెండు బోర్డులు సమర్పించిన లిఖితపూర్వక నివేదికలను పరిశీలించిన తర్వాత పీసీబీ వాదనను కొట్టేస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top