భారత్‌ చేతిలో పాక్‌ ఓటమి 

ICC dismisses Pakistan Cricket Board's compensation case against BCCI - Sakshi

‘నష్టపరిహారం’ కేసులో బీసీసీఐ గెలుపు

పీసీబీ వాదనను తిరస్కరించిన ఐసీసీ

అప్పీల్‌ కూడా చేయరాదని ఆదేశం   

దుబాయ్‌: క్రికెట్‌ మైదానంలోనే కాదు న్యాయస్థానంలో కూడా భారత్‌ చేతిలో పాకిస్తాన్‌కు పరాజయం తప్పలేదు. తమతో సిరీస్‌లు ఆడతానని చెప్పి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ‘మాట తప్పినందుకు’ రూ.447 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చేసిన వాదనను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తిరస్కరించింది. పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చుతున్నామని, భారత్‌ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్‌సీ) తీర్పు చెప్పింది. దీనికి పాక్‌ బోర్డు కట్టుబడి ఉండాలని, అప్పీల్‌కు కూడా వెళ్లరాదని ఆదేశించింది. తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పీసీబీ తమ బోర్డులో చర్చించి తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పింది. మరోవైపు పాక్‌ బాధను మరింత పెంచే విధంగా ‘న్యాయపరమైన ఖర్చులు’ పీసీబీ తమకు తిరిగి చెల్లించాలంటూ డీఆర్‌సీని ఆశ్రయిస్తామని కూడా బీసీసీఐ ప్రకటించింది.  

ఇదీ కేసు నేపథ్యం... 
భారత్, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు సంబంధించి 2014 ఏప్రిల్‌లో ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో ‘బిగ్‌ త్రీ’ఫార్ములాకు అనుకూలంగా పాక్‌ ఓటేయడంతో ప్రత్యుపకారంగా భారత్‌ ఈ సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. దీని ప్రకారం 2015–2023 మధ్య ఇరు జట్ల మధ్య ఆరు సిరీస్‌లు జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ సిరీస్‌ల నిర్వహణ కష్టంగా మారింది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప తాము ఆడలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫలితంగా షెడ్యూల్‌ ప్రకారం 2014, 2015లలో జరగాల్సిన సిరీస్‌లు జరగలేదు. వీటి రద్దు వల్ల తాము భారీగా నష్టపోయామని, కాబట్టి పరిహారంగా సుమారు 63 కోట్ల డాలర్లు వడ్డీ, ఖర్చులతో సహా తమకు బీసీసీఐ చెల్లించాలని పాక్‌ నోటీసు పంపించింది.   

ఒప్పందం తప్పనిసరి కాదు...  
వివాదంపై ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 3 వరకు వాదనలు కొనసాగాయి. బీసీసీఐ తరఫున సల్మాన్‌ ఖుర్షీద్, శశాంక్‌ మనోహర్, సంజయ్‌ పటేల్, రత్నాకర్‌ శెట్టి, సుందర్‌ రామన్‌ దీనికి హాజరయ్యారు. ఎంఓయూ అనేది కేవలం ఆడేందుకు ఆసక్తి కనబర్చిన అంగీకార పత్రం మాత్రమేనని, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, పైగా తాము గతంలోనే చెప్పినట్లుగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏమీ చేయలేమని కూడా వారు కమిటీకి స్పష్టం చేశారు. అయితే ఒప్పం దాన్ని ఉల్లంఘించడం తప్పని పీసీబీ వాదించింది. చివరకు భారత బోర్డు వైపే డీఆర్‌సీ తీర్పునిచ్చింది.  

బీసీసీఐ లీగల్‌ టీమ్, క్రికెట్‌ ఆపరేషన్స్‌ టీమ్, సీఈఓల కృషిని నేను అభినందిస్తున్నా. వీరంతా బాగా సన్నద్ధమై అన్ని జాగ్రత్తలతో తమ వాదనలు సమర్థంగా వినిపించారు. బోర్డు తరఫున హాజరైన వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. ఐసీసీ, డీఆర్‌సీ సభ్యులకు కృతజ్ఞతలు. ఇకపై కూడా మేం ఐసీసీ సభ్య దేశాలన్నింటితో క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం.    
– వినోద్‌ రాయ్, సీఓఏ చైర్మన్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top