సెంచరీతో చెలరేగిన బెల్

సెంచరీతో చెలరేగిన బెల్


లండన్: యాషెస్ సిరీస్‌లో ఇయాన్ బెల్ (211 బంతుల్లో 109; 16 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీ సాధించడంతో... లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. బెల్‌కు బెయిర్ స్టో (146 బంతుల్లో 67; 7 ఫోర్లు), ట్రాట్ (87 బంతుల్లో 58; 11 ఫోర్లు) అండగా నిలవడంతో మొదటి రోజు గురువారం ఆట ముగిసే సరికి కుక్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ట్రాట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించిన బెల్, ఐదో వికెట్‌కు బెయిర్‌స్టోతో 144 పరుగులు జత చేశాడు. ఆసీస్ బౌలర్లలో హారిస్, స్మిత్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి. ఆట ముగిసే సమయానికి బ్రెస్నన్ (7), అండర్సన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.

 

 28 పరుగులకే 3 వికెట్లు...

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ గత టెస్టు ఆడిన ఫిన్ స్థానంలో బ్రెస్నన్‌కు  అవకాశం కల్పించింది. ఆసీస్ జట్టులో కూడా కొవాన్, స్టార్క్ స్థానంలో ఖాజా, హారిస్ జట్టులోకి వచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు వాట్సన్ షాక్ ఇచ్చాడు. తాను వేసిన రెండో బంతికే కెప్టెన్ కుక్ (12)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే హారిస్ చెలరేగాడు. నాలుగు బంతుల వ్యవధిలో రూట్ (6), పీటర్సన్ (2)లను అవుట్ చేశాడు. దాంతో 28 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

 ఈ దశలో ట్రాట్, బెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. హారిస్ మినహా ఇతర ఆసీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగులు రాబట్టారు. లంచ్ విరామం అనంతరం మరోసారి హారిస్‌కే వికెట్ దక్కింది. పుల్ షాట్ ఆడబోయిన ట్రాట్, ఖాజా చేతికి చిక్కాడు. అనంతరం బెల్‌కు బెయిర్‌స్టో సహకారం అందించాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిడిల్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అది నోబాల్ కావడంతో బతికిపోయిన అతను, అనంతరం భారీ భాగస్వామ్యంలో తన వంతు పాత్ర పోషించాడు.

 

 స్మిత్ మాయ...

 ఒక దశలో 271/3 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన ఇంగ్లండ్... స్టీవెన్ స్మిత్ లెగ్ స్పిన్‌కు బోల్తా పడింది. పార్ట్‌టైమర్ స్మిత్ 12 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు.  203 బంతుల్లో కెరీర్‌లో 19వ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే బెల్... స్మిత్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరి కొద్దిసేపటికే బెయిర్‌స్టో, ప్రయర్‌లను కూడా స్మిత్ పెవిలియన్ పంపించాడు. దీంతో ఆసీస్ తేరుకుంది.

 

 క్రికెట్

 వెస్టిండీస్ x పాకిస్థాన్

 మూడో వన్డే

 సా. గం. 6.30 నుంచి

 టెన్ క్రికెట్‌లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top