అది నా దురదృష్టం: రషీద్‌ ఖాన్‌

I would love to bowl to Sachin,Rashid Khan - Sakshi

డెహ్రాడూన్‌: ప్రపంచ క్రికెట్‌లో సత్తాచాటుతున్న అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. గత రెండు రోజుల క్రితం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకును నిలుపుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర  పోషించిన రషీద్‌.. ఆ సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్నాడు. అదే సమయంలో 813 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా, జూన్‌ 14 నుంచి బెంగళూరు వేదికగా భారత్,  అఫ్గానిస్తాన్‌  మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ మాట్లాడాడు. దీనిలో భాగంగా తనకు అత్యంత ఇష్టమైన బ్యాట్స్‌మన్‌ ఎవరు అనే విషయాన్ని స్పష్టం చేశాడు.

‘విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తా.  ఎందుకంటే ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అతనే బెస్ట్ బ్యాట్స్‌మెన్. భారత జట్టులో కూడా చాలా మంది వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నారు’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయలేకపోయాననే చిన్న అసంతృప్తి ఉండిపోతుందని ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సచిన్‌ టెండూల్కర్‌కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల. మళ్లీ అలాంటి గొప్ప ఆటగాడు క్రికెట్‌లోకి వస్తాడని నేను అనుకోవట్లేదు. అందుకే.. అతనికి బౌలింగ్ చేయలేకపోవడం నా దుర‌దృష్టంగా భావిస్తున్నా’ అని రషీద్ నిరాశ వ్యక్తం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top