నేను దారుణమైన నిర‍్ణయాలు తీసుకున్నా: స్మిత్‌

I was making horrible decisions, Smith reveals - Sakshi

కింగ్‌ సిటీ(కెనడా): బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి దేశ ప్రజల నమ్మకాన్ని గెలిచేందుకు కృషి చేస్తున్నాడు. దీనిలో భాగంగా కెనడాలో జరుగుతున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరపున స్మిత్‌ పాల్గొంటున్నాడు. ఈ మేరకు గురువారం జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌(61; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కాగా, మ్యాచ్‌ అనంతరం స్మిత్‌ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితిని మరోసారి మీడియాకు వివరించాడు. తాను నిజాయితీగా ఉన్న సమయంలోనే ఎత్తు పల్లాల్ని చవిచూడాల్సి రావడం బాధాకరమన్నాడు. అయితే మానసికంగా అలసిపోవడం వల్ల కొన్ని దారుణమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చిందని ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకోవడాన్ని పరోక్షంగా సమర్ధించుకున్నాడు.

‘యాషెస్‌ సిరీస్‌ దగ్గర్నుంచి మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొన్నా. దాంతో కొన్ని దారుణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ‍్చింది. మానసికంగా ఎక‍్కువగా అలసిపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆసీస్‌ క్రికెట్‌ నుంచి కొంత బ్రేక్‌ తీసుకోవడం నాకు లాభిస్తుందనే అనుకుంటున్నా. నా పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటానని, మళ్లీ పూర‍్వపు ఫామ్‌తో జట్టుకు సేవలందిస్తానన్న నమ్మకం ఉందని’ స్మిత్‌ పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ చేసినట్లు రుజువు కావడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top