'టీమిండియా కోచ్ గా చేయాలని ఉంది'

'టీమిండియా కోచ్ గా చేయాలని ఉంది'


సిడ్నీ: భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస్తానని ఆసీస్ మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ స్పష్టం చేశాడు. భారత్ కోచ్ గా రవిశాస్త్రి ఎంపికైన తరువాత గిలెస్పీ తన మనసులో మాటను వెల్లడించాడు. భారత క్రికెట్ కోచ్ గా చేయడమనేది చాలా గొప్పదిగా అభివర్ణించిన గిలెస్పీ.. తాజాగా ఆ బాధ్యతను తీసుకున్న రవిశాస్త్రికి అభినందనలు తెలియజేశాడు.


 


'కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రికి అభినందనలు.  టీమిండియా కోచ్ అనేది చాలా పెద్ద జాబ్. నాకు కూడా భారత జట్టుకు కోచ్ గా చేయాలని ఉంది. ఈసారి అందుకోసం దరఖాస్తు చేసే అంశంపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. దీనిపై కుటుంబ సభ్యులతో చాలా తీవ్రంగా చర్చించాను కూడా. అయితే నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యా. భవిష్యత్తులో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసే అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తా. ఏదొక రోజు భారత క్రికెట్ కోచ్ అవుతాననే నమ్మకం కూడా ఉంది' గిలెస్పీ అన్నాడు. 1996 నుంచి 2006 వరకూ ఆసీస్ తరపున గిలెస్పీ కీలక పాత్ర పోషించాడు.  ఈ కుడి చేతివాటం బౌలర్ 71 టెస్టు మ్యాచ్ ల్లో 259 వికెట్లు సాధించగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు.

Back to Top