రాయుడి బాధను నేనూ అనుభవించా

I can imagine what Ambati Rayudu must be going through says Gautam Gambhir   - Sakshi

47 సగటు ఉన్న బ్యాట్స్‌మన్‌ ప్రపంచకప్‌కు పనికిరాడా?

వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికపై గంభీర్‌ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ జట్టుకు హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడును ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా బాధిస్తోందని భారత జట్టు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. టీమిండియాకు ఎంపికవని తన ఢిల్లీ జూనియర్‌ రిషభ్‌ పంత్‌ కంటే తెలుగు తేజం రాయుడిని చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.  రాయుడు గతేడాది అద్భుతంగా ఆడాడు. దీంతో భారత కెప్టెన్‌ కోహ్లినే స్వయంగా నాలుగో స్థానానికి రాయుడే సరైన బ్యాట్స్‌మన్‌ అని ప్రకటించాడు. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో విఫలమవడంతో ఆలోచనలో పడ్డ సెలక్టర్లు వేరే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నారు. ప్రపంచకప్‌ జట్టు ఎంపికపై గంభీర్‌ అభిప్రాయాలు అతని మాటల్లోనే... 

పంత్‌ కంటే ఇదే పెద్ద బాధ... 
ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో పంత్‌ లేకపోవడంపై నాకు బాధేమీ లేదు. కానీ అంబటి రాయుడు లేకపోవడం చెప్పలేనంత బాధగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. తెలుపు బంతి క్రికెట్‌లో 47 సగటు నమోదు చేసిన 33 ఏళ్ల ఆటగాడి (రాయుడు)ని పక్కన బెట్టడం ఘోరం. సెలక్షన్‌ కమిటీ చేసిన మొత్తం ఎంపిక ప్రక్రియలో ఈ అంశమే నన్ను తీవ్రంగా కలచివేస్తుంది.  

నాకు ఇలాగే జరిగింది... 
2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో నాకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మెగా ఈవెంట్‌లో ఆడటమనేది ప్రతి క్రికెటర్‌ కల. చిన్నప్పటి నుంచే ప్రతి ఆటగాడు కనే కల ఇదే. ఈ స్వప్నం సాకారం కాకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే రాయుడి బాధను అర్థం చేసుకోగలను. రాయుడు ఆడినంత మెరుగ్గా, నిలకడగా తెలుపుబంతి క్రికెట్‌ను పంత్‌ ఆడనేలేదు. టెస్టులే ఆడాడు.  పంత్‌కిది ఎదురుదెబ్బ కూడా కాదు. అతను ఇంకా కుర్రాడు. పంత్‌లో ప్రతిభే కాదు వయసూ ఉంది. ఆడే భవిష్యత్తు ఉంది. కొద్దొగొప్పొ టెస్టులే బాగా ఆడిన అతన్ని వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయకుంటే ఎదురుదెబ్బ ఎలా అవుతుంది? నిజానికి వన్డేల్లో చాలాకాలంగా దినేశ్‌ కార్తీకే బ్యాకప్‌ కీపర్‌గా ఉంటూ వచ్చాడు. కాబట్టి సెలక్టర్లు పంత్‌ కంటే దినేశే మెరుగని భావించి ఉండొచ్చు. నా దృష్టిలో అయితే రెండో వికెట్‌ కీపర్‌గా సంజూ సామ్సన్‌ బాగుంటాడు. నాలుగో స్థానంలో ఎంతో కాలంగా బాగా ఆడుతున్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top