ఆ సమస్య నాకు లేదు: శ్రేయస్‌ అయ్యర్‌

I am Flexible Batting At Any Position, Iyer - Sakshi

ట్రినిడాడ్‌: ‘అవకాశాలు ఇస్తేనే కదా మనలోని సత్తా తెలిసేది’ అంటూ ఇటీవల వ్యాఖ్యానించిన టీమిండియా క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. తాజాగా తనకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసే సత్తా ఉందని స్పష్టం చేశాడు. తనకు ఫలానా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రావాలనే లక్ష్యమేమి లేదని, ఎక్కడైనా బ్యాటింగ​ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ‘పరిస్థితుల్ని బట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ దింపినా ఇబ్బంది లేదు. ఫలానా స్థానంలో రావాలనే సమస్య నాకు లేదు. నన్ను ఎక్కడ దింపుతారనే అనేది నాకు తెలీదు. అది మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నన్ను నాల్గో స్థానంలో పంపితే అందుకు న్యాయం చేయడానికి యత్నిస్తా.  ప్రత్యేకంగా నాల్గో స్థానం గురించి ఆలోచించడం లేదు. నాకు వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంపైనే దృష్టి సారించా’ అని అయ్యర్‌ పేర్కొన్నాడు.

గత కొంతకాలంగా టీమిండియా నాల్గో స్థానంపై అన్వేషణ ప్రారంభించిన నేపథ్యంలో అయ్యర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విండీస్‌ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ను రెండో వన్డేలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దింపే అవకాశాలున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో ఇరు జట్లు రెండో వన్డేలో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని భావిస్తున్నాయి. టీ20 సిరీస్‌ కోల్పోయిన ఆతిథ్య వెస్టిండీస్‌ జట్టు కనీసం వన్డే సిరీస్‌ను గెలవాలనే పట్టుదలగా ఉంది. అదే సమయంలో విరాట్‌ కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ కూడా వన్డే సిరీస్‌ను స్వీప్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top