హైదరాబాద్‌ శుభారంభం

 మధ్యప్రదేశ్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం

 మెరిసిన తన్మయ్, రోహిత్‌ రాయుడు, సిరాజ్‌

 విజయ్‌ హజారే వన్డే టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: విజయ్‌ హజారే దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు ఘనవిజయంతో శుభారంభం చేసింది. న్యూఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌ వేదికగా బుధవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ 48.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. రజత్‌ పటీదార్‌ (49; 5 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (44; 6 ఫోర్లు), శరాన్‌‡్ష జైన్‌ (45; 6 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో మొహమ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

ఆకాశ్‌ భండారి 2 వికెట్లు పడగొట్టాడు. రవికిరణ్, సీవీ మిలింద్, మెహదీ హసన్, ఆశిష్‌ రెడ్డి తలా ఓ వికెట్‌ తీశారు. అనంతరం 232 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ 47.4 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి (42 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరు 59 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం తన్మయ్‌ అగర్వాల్‌ (109 బంతుల్లో 83; 5 ఫోర్లు), కె. రోహిత్‌ రాయుడు (102 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) నింపాదిగా ఆడుతూ అర్ధసెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 133 పరుగులను జోడించిన తర్వాత రమీజ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో తన్మయ్‌ ఔటయ్యాడు. మరికొద్దిసేపటికే రోహిత్‌ కూడా పెవిలియన్‌ చేరగా... మిగతా పనిని బి. సందీప్‌ (24 నాటౌట్‌; 3 ఫోర్లు), సుమంత్‌ కొల్లా (9 నాటౌట్‌) పూర్తిచేశారు. ప్రత్యర్థి బౌలర్లలో రమీజ్‌ ఖాన్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top