11 వికెట్లతో చెలరేగాడు..
జమైకా: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో వెస్టిండీస్ 166 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 42.0 ఓవర్లలో 168 పరుగులకే చాపచుట్టేసింది. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించిన హోల్డర్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 11 వికెట్లు సాధించిన హోల్డర్ టెస్టు కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
మూడోరోజు ఆటలో భాగంగా శనివారం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత లిటన్ దాస్(33), షకిబుల్ హసన్(54), ముష్ఫికర్ రహీమ్(31)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో బంగ్లాదేశ్‌కు ఘోర ఓటమి తప్పలేదు. హోల్డర్‌కు జతగా ఛేజ్ రెండు వికెట్లు సాధించగా, గాబ్రియల్, కీమో పౌల్‌లు తలో వికెట్ తీశారు.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 354 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 129 ఆలౌట్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 168 ఆలౌట్
సంబంధిత వార్తలు