అత్యధిక టార్గెట్‌ ఛేజింగ్‌లు ఇవే..

Highest targets chased down at Port elizabeth - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: భారత్‌-దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో విజయం ఎవరి అనేది కాసేపట్లో తేలిపోనుంది. సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌ స్టేడియంలో భారత జట్టు తొలిసారి అత్యధిక స్కోరును నమోదు చేయడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ను సాధించడంతో పాటు నంబర్‌ వన్‌ ర్యాంకును కాపాడుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్ర సిరీస్‌ ఫలితం కోసం భారత్‌ కడవరకూ వేచి చూడక తప్పదు. దీనిలో భాగంగా పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌లో అత్యధిక టార్గెట్‌ ఛేజింగ్‌లను ఒకసారి చూద్దాం. 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 327 పరుగుల లక్ష్యాన్ని ఇక్కడ ఛేదించింది.  ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ మూడు వికెట్ల తేడాతో ఇంకా ఐదు బంతులుండగా విజయాన్ని అందుకుంది.

ఆపై 2005లో ఇక‍్కడ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆనాటి మ్యాచ్‌లో సఫారీలు ఏడు వికెట్లు కోల్పోయి ఐదు బంతులుండగా గెలుపును అందుకున్నారు. అటు తరువాత 2015లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌ చేధించింది. వెస్టిండీస్‌ ఇంకా తొమ్మిది బంతులుండగా వికెట్‌ తేడాతో గెలుపొందింది. ఇక 2016లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 263 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది. ఇవే అక్కడ అత్యధిక టార్గెట్‌ ఛేజింగ్‌లు. కాగా, ఇక్కడ ఇప‍్పటివరకూ 39 వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో ఛేజింగ్‌ జట్టు 19 సార్లు గెలవగా, మరో 19 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే ఇక్కడ భారత జట్టు నాలుగు సార్లు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలు కాగా, ఒకసారి కెన్యా చేతిలోనూ ఓడింది. తాజా మ్యాచ్‌లో భారత్‌ జట్టు దక్షిణాఫ్రికాకు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.   ఈ మ్యాచ్‌కు ముందు వరకూ భారత జట్టు అత్యధిక స్కోరు కూడా 176 మాత్రమే. తొలిసారి ఈ స్టేడియంలో రెండొందల పరుగుల మార్కును చేరిన భారత జట్టు విజయాన్ని అందుకుని సిరీస్‌ను సాధిస్తుందో.. లేదో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top