వాటిపై దృష్టి సారిస్తా : హార్ధిక్‌ పాండ్యా

Hardik Pandya Perfect Helicopter Shot Infront Of Dhoni He Feels Special - Sakshi

ముంబై : మిస్టర్‌ కూల్‌  ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో 100వ విజయాన్ని నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంత మైదానంలో ఈ చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంలో ముంబై ఆటగాడు హార్థిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌తో.. ఆ తర్వాత బౌలింగ్‌తో అదరగొట్టి ఆల్‌రౌండ్‌ షోతో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో బ్రేవో బౌలింగ్‌ను చీల్చి చెండాడిన తీరు.. అతడి బౌలింగ్‌లో పాండ్యా బాదిన ‘ధోని స్పెషల్‌- హెలికాప్టర్‌ షాట్‌’ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పాండ్యా మాట్లాడుతూ... ‘ ధోని భాయ్‌ ముందు హెలికాప్టర్‌ షాట్‌ కొట్టడం నాకు చాలా ప్రత్యేకం. నాకు తెలిసి.. ఈ షాట్‌ గురించి ఎంఎస్‌ నన్ను కచ్చితంగా మెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’  అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

వాటిపై దృష్టి సారిస్తా..
 ‘గాయం, వివాదాల కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన కష్టకాలంలో నాకు అండగా నిలిచిన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఏడు నెలలుగా నెట్స్‌లో కఠోరంగా శ్రమించా. ఈరోజు దానికి ఫలితం దక్కింది. ప్రస్తుతం ఐపీఎల్‌పైనే కాకుండా రానున్న ప్రపంచకప్‌లో ఎలా ఆడాలన్న విషయంపై దృష్టి సారిస్తున్నా. అవకాశం వస్తే భారత్‌ వరల్డ్‌ కప్‌ కొట్టడంలో నా వంతు పాత్ర పోషిస్తా’  అంటూ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. కాగా మొదట బ్యాటింగ్‌లో (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), తర్వాత బౌలింగ్‌లో (3/20) పాండ్యా చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top