బాయిష్‌ టాక్‌ అసందర్భం

Hardik Pandya, KL Rahul suspended, to miss ODI series  - Sakshi

ఇండియాలో ‘మీటూ’ను రాజేసిన తనుశ్రీ దత్తా గురువారం యు.ఎస్‌. వెళ్లిపోయారు. ‘నా జీవితంలో ఇంతలా ఎప్పుడూ సఫర్‌ అవ్వలేదు’ అన్నారు వెళ్లేముందు. హాలీవుడ్‌ దిగ్గజం వైన్‌స్టీన్‌పై తొలిసారి ఫిర్యాదు చేసి, ‘మీటూ’ ఉద్యమం ఆవిర్భావానికి కారణం అయిన నటి ఆష్లీ జూడ్‌ కేసును కోర్టు తోసిపుచ్చింది. పోరాటంలో వీళ్లిద్దరూ ఓడిపోయి ఉండొచ్చు. కానీ, స్త్రీల పట్ల మగవాళ్ల ప్రవర్తనను సమాజం ఇప్పుడు నిశితంగా గమనిస్తూ, నియంత్రిస్తోందంటే అది ‘మీటూ’ బాధితుల ఘనతే. 

సిడ్నీలో నేడు మొదలవుతున్న మూడు వన్డేల ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి వన్డే భారతీయ జట్టులో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ ఆడడం లేదు. గాయాల కారణంగా బోర్డు వారిని ఈ వన్డేకు దూరంగా ఉంచింది. అయితే అవి పాండ్యా, రాహుల్‌ చేసుకున్న గాయాలు కాదు. చేసిన గాయాలు. ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో ఇరవై ఐదేళ్ల పాండ్యా, ఇరవై ఆరేళ్ల రాహుల్‌ ఒళ్లు తెలియకుండా మాట్లాడి స్త్రీల మనోభావాలను గాయపరిచారు. ఇలాంటి వాళ్లు రేపు ‘హనీట్రాప్‌’లో (తేనెమాటల వల) పడి, బుకీలకు బుక్కైపోరనేముంది అని బీసీసీఐ కోశాధికారి అనిరు«ద్‌ చౌదరి అనుమానిస్తున్నారు. చిన్న శిక్ష వేస్తే సెట్‌ రైట్‌ అవుతారని బోర్డు కూడా భావించినట్లుంది.

క్రికెటర్‌ల మాట, చూపు, నవ్వు, నడక.. పదీపన్నెండేళ్ల వయసుకే మగపిల్లలకు సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ డిసీజ్‌లా అంటుకునే దేశం మనది. వాళ్లేం చేస్తే వీళ్లది చేస్తారు. వాళ్లేం చేశామని చెప్పుకుంటే వీళ్లది చెయ్యడానికి ట్రై చేస్తారు. కరణ్‌ చాట్‌ షోలో పాండ్యా అన్నాడు.. తను గడిపిన అమ్మాయిలెవరూ తనకు గుర్తుండరని, వాళ్ల పేర్లు కూడా తను అడగనని! షోలో రాహుల్‌ కొంచెం నయంగా ఉన్నాడు. ‘‘మీ ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడితే?’’ అని కరణ్‌ అడిగిన ప్రశ్నకు ‘‘అది ఆ అమ్మాయి ఇష్టం’’ అని రాహుల్‌ నవ్వుతూ అన్నాడు. పాండ్యా మళ్లీ షర్ట్‌ బటన్‌లు విప్పుకున్నాడు. ‘బలమున్న వాడిదే అబల’ అన్నాడు. ఈ చెత్త ‘బాయిష్‌ టాక్‌’ వీళ్లను ప్రస్తుతానికయితే ఒక వన్‌డేకి చెత్తబుట్టలో పడేసింది. పాండ్యాకు ట్విట్టర్‌లో ముప్పై లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. రాహుల్‌కి ఇరవై లక్షల మంది. ఈ ఫాలోవర్స్‌లో టీన్‌ బాయ్స్‌ ఉంటారు కదా.. ఇక వాళ్లకు మొదలౌతుంది.. క్రికెట్‌లో రన్‌లు కొట్టడం, వికెట్స్‌ పడగొట్టడం పెద్ద గొప్పేం కాదని.

పాండ్యా, రాహుల్‌ల ఈడువాడే డ్రేక్‌. అయితే ఇప్పుడు కాదు. పదేళ్ల క్రితం. కెనడా పాప్‌ సింగర్‌. ‘కీకీ.. డు యు లైవ్‌ మీ’ అనే మాట ‘ఇన్‌ మై ఫీలింగ్‌’ అనే అతడి పాటలోనిదే. ఆ మాటను తీసుకుని యు.ఎస్‌.కమెడియన్‌ షోకర్‌ కీకీ ఛాలెంజ్‌ మొదలుపెట్టాడు. ఆ చాలెంజ్‌కీ, డ్రేక్‌కీ సంబంధం లేదు కానీ, డ్రేక్‌ ఇప్పుడు ఊహించని ఛాలెంజ్‌ను ఎదుర్కోవలసి వస్తోంది. 2010లో యు.ఎస్‌.లోని డెన్వర్‌ (కొలరెడో స్టేట్‌)లో ఆగ్డెన్‌ థియేటర్‌ స్టేజీ మీద షో ఇస్తూ, ఆడియెన్స్‌లోంచి పైకి రప్పించుకున్న ఓ పదిహేడేళ్ల బాలికతో అతడు ప్రవర్తించిన తీరును ఇప్పుడు సోషల్‌ మీడియా అసహ్యించుకుంటోంది. కొలరెడో చట్టం ప్రకారం పదిహేడేళ్లు నిండని బాలికపై చెయ్యి వెయ్యడం నేరం. స్టేజీ మీద డ్రేక్‌ ఆ అమ్మాయిని వెనుక నుంచి ఆలింగనం చేసుకుంటూ ఆమె బ్రెస్ట్‌ మీదకు రెండు చేతులూ పోనిచ్చాడు. తర్వాత ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. భుజాల్ని ముద్దు పెట్టుకున్నాడు. నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు. చివరికి ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. గువ్వలా ముడుచుకుని నిలబడింది ఆ బాలిక అతడివన్నీ చేస్తున్నప్పుడు. మధ్యలో.. ‘నీ వయసెంత?’ అని ఆ అమ్మాయిని అడిగాడు. ‘పదిహేడు’ అని చెప్పింది. ‘కానీ భలేగున్నావే! థిక్‌గా’ అన్నాడు! ఒళ్లు తెలియలేదు డ్రేక్‌కి. ఆ క్లిప్‌ను ఇప్పుడెవరో తవ్వి తీశారు.డ్రేక్‌ దీనిపై ఏమీ మాట్లాడ్డం లేదు.   

బ్రిటిష్‌ చెఫ్‌ గోర్డన్‌ రామ్సే (52)ను కూడా నాలుగు రోజులుగా సోషల్‌ మీడియా ఫ్రై చేస్తోంది. అతడిదీ ‘షో’ ఎఫెక్టే. పదేళ్ల నాటి ‘టునైట్‌’ టీవీ షోలో తనతో పాటు గెస్ట్‌గా కూర్చున్న ముప్పై ఆరేళ్ల (అప్పటికి) హాలీవుడ్‌ నటి సొఫీయా వెర్గారాను అతడు పదేపదే చవకబారు జోకులతో కామెంట్‌ చేస్తున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడెవరో మళ్లీ నెట్‌ ఉపరితలానికి తేల్చారు. షోను జే లెనో హోస్ట్‌ చేస్తున్నారు. సొఫీయా ఏం మాట్లాడినా, చెఫ్‌ గోర్డన్‌ కల్పించుకుంటున్నాడు. తను నటించిన ఏదో సన్నివేశం గురించి చెబుతూ, ‘నా జీవితంలో నేనెప్పుడూ అంతలా అరవలేదు’ అని సొఫీయా అనగానే, ‘బెడ్‌ మీద తప్ప’ అని గోర్డన్‌ ఆమె మాటకు కంక్లూజన్‌ ఇచ్చాడు! ఇంకా నానా చెత్తా మాట్లాడాడు. సొఫీయా కోపాన్ని అతి కష్టం మీద ఆపుకున్నారు. ‘ఇదీ నా ఇంటర్వ్యూ’ అని ఆ తర్వాత తలకొట్టుకున్నారు. ఇప్పుడీ ఇద్దరు కుర్రాళ్లు.. పాండ్యా, రాహుల్‌!

మీటూ మొదలయ్యాక, కలుగుల్లో దాక్కుని ఉన్న ‘బాయిష్‌ టాక్‌’ను కూడా తోక పట్టుకుని బయటికి లాగి పడేస్తున్న సోషల్‌ మీడియా.. డర్టీ బాయ్స్‌ని ఏ మాత్రం సహించే మూడ్‌లో లేదు. బుద్ధిగా ఉండడం ఒక్కటే మగవాళ్లు ఇక చేయవలసిన పని... మగబుద్ధిగా కాదు.        
∙మాధవ్‌ శింగరాజు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top