గావస్కర్‌ ఆశ్చర్యం.. సమర్థించిన రహానే

Gavaskar Expressed His Astonishment at The Exclusion of Ashwin Against West Indies - Sakshi

అంటిగ్వా: ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉండి.. అందులోనూ వెస్టిండీస్‌పై అత్యద్భుతమై ట్రాక్‌ రికార్డు ఉన్న ఆటగాడికి 11 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది’అంటూ గావస్కర్‌ పేర్కొన్నాడు. గావస్కర్‌తో పాటు పలువురు మాజీలు తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ విషయంపై తొలి రోజు మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే మాట్లాడుతూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని సమర్థించాడు. 

‘అశ్విన్‌ వంటి సీనియర్‌ ఆటగాడిని మేనేజ్‌మెంట్‌ తప్పించడానికి అనేకమార్లు ఆలోచించింది. అయితే బెస్ట్‌ బౌలింగ్‌ కాంబినేషన్‌ కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. వ్యూహంలో భాగంగా రవీంద్ర జడేజానే బెస్ట్‌ ఆప్షన్‌గా మేనేజ్‌మెంట్‌ భావించింది. అంతేకాకుండా జడేజా ఆరో నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు ఉపయోగపడగలడు. జడేజాకు విహారి పార్ట్‌టైమ్‌ ఆఫ్‌స్పిన్‌ ఉపయుక్తం కాగలదని అంచనా వేసింది. రోహిత్‌ శర్మ వంటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమవడం కొంచెం కష్టమే. కానీ జట్టు కోసం తప్పదు ’అంటూ రహానే పేర్కొన్నాడు.

అశ్విన్‌కు వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డే ఉంది. విండీస్‌పై ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ 60 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్లను నాలుగు సందర్భాల్లో సాధించాడు. అంతేకాకుండా 552 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. విండీస్‌పై ఆల్‌రౌండర్‌గా మంచి రికార్డు ఉన్న అశ్విన్‌ను జట్టు లోకి తీసుకోకపోవడం ఎవరికీ మింగుడు పడటం లేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top