ప్రపంచకప్‌ జట్టులో అదొక్కటే మిస్సయ్యింది: గంభీర్‌

Gautam Gambhir Points out what Has Missing in India Squad - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ జట్టులో ఒక్క విషయం తప్పా అంతా బాగానే ఉందని, ప్రస్తుత జట్టు 2011 ప్రపంచకప్‌ జట్టు కన్నా బాగుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఏదైనా లోటు ఉందనుకుంటే.. అది బౌలింగ్‌ విభాగంలోనేనని, ఇంగ్లండ్‌ పిచ్‌లకు అనుగుణంగా నలుగురు పేసర్లను ఎంపిక చేయాల్సిందన్నాడు. ‘జట్టులో ఎదైనా లోటు ఉందని భావిస్తే.. నాలుగో సీమర్‌ లేకపోవడమే. ఇది చాలా పెద్ద టోర్నీ. ఇప్పుడు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు మాత్రమే ఉన్నారు. అందుకే నేను నాలుగో సీమర్‌గా నవదీప్‌సైనీ ఎంపిక చేశాను. ఎందుకంటే ఇంగ్లండ్‌ పరిస్థితులకు దగ్గట్లు ముగ్గరు పేసర్లకు బ్యాకప్‌గా నాలుగో సీమర్‌ ఉండాలి’ ఓ టీవీ చానెల్‌తో పేర్కొన్నాడు.

ఇక 2011, 2015 ప్రపంచకప్‌ జట్ల కన్నా ప్రస్తుత జట్టు బలంగా ఉందని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.. అప్పటి బౌలింగ్‌ అటాక్‌ కన్నా ప్రస్తుత బౌలింగ్‌ అటాక్‌ అద్భుతంగా ఉందని కొనియాడాడు. తనకు గణంకాలు లెక్కించడం, పోల్చడం ఇష్టం ఉండదని, అయినా ప్రస్తుత జట్టుకు ప్రపంచకప్‌ నెగ్గే సత్తా ఉందన్నాడు. ఇక ప్రపంచకప్‌ సెలక్షన్‌ ప్యానెల్‌ ముగ్గురు స్పెషలిస్టు పేసర్లు జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీలతో పాటు హార్ధిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌ ఇద్దరు ఆల్‌రౌండర్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే మరో సీమర్‌ను ఎంపికచేసి ఉంటే బ్యాకప్‌గా ఉండేవాడని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో పంత్‌ లేకపోవడంపై తనకేం బాధలేదని, కానీ అంబటి రాయుడు లేకపోవడం చెప్పలేనంత బాధగా ఉందని ఇటీవల గంభీర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాయుడుకు చోటు దక్కకపోవడం చాలా దురదృష్టకరమని, తెలుపు బంతి క్రికెట్‌లో 47 సగటు నమోదు చేసిన 33 ఏళ్ల ఆటగాడి (రాయుడు)ని పక్కన బెట్టడం ఘోరమన్నాడు. సెలక్షన్‌ కమిటీ చేసిన మొత్తం ఎంపిక ప్రక్రియలో ఈ అంశమే నన్ను తీవ్రంగా కలచివేస్తుందని చెప్పకొచ్చాడు.  2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో తనకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top