రిటైర్మెంట్‌ ప్రకటించిన గౌతం గంభీర్‌

Gautam Gambhir Announces Retirement From Cricket - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన గంభీర్‌.. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌ లీగ్‌ల్లో మాత్రమే ఆడుతూ వచ్చాడు. మంగళవారం ఆకస్మాత్తుగా అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విటర్‌లో ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం నాడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ గౌతం గంభీర్‌కు చివరి మ్యాచ్ కానుందని తెలుస్తోంది. 2016లో ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ ఆడిన గంభీర్‌.. చివరి వన్డేను 2013లో ఇంగ్లండ్‌తోనే ఆడాడు.

పాకిస్తాన్‌పై 2012లో చివరి టీ20 ఆడిన గంభీర్‌.. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో 97 పరుగులతో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టులో కూడా సభ్యుడు. 37 ఏళ్ల గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్‌ జట్టుకు దూరమైనా.. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న గంభీర్‌ గత సీజన్లలో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆజట్టు గంభీర్‌ను ఈ సీజన్‌కు వదులుకుంది. సారథిగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు రెండుసార్లు టైటిల్‌ అందించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్‌ కూడా ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top