ఆసీస్‌కు పాక్‌ సవాల్‌

Former champion Pakistan faces a match against Australia today - Sakshi

కీలక విజయంపై ఇరు జట్ల దృష్టి

మ్యాచ్‌కు వాన గండం

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

టాంటన్‌: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో నేడు జరిగే మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతుంది. టోర్నీలో రెండు విజయాల తర్వాత భారత్‌ చేతిలో ఓడిన ఆసీస్‌ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉండగా... శ్రీలంకతో గత మ్యాచ్‌ రద్దయిన తర్వాత పాక్‌ మళ్లీ మైదానంలోకి దిగుతోంది. చిన్న జట్టు అఫ్గానిస్తాన్‌ను ఓడించిన తర్వాత ఆసీస్‌... విండీస్‌ చేతిలో ఓటమిని త్రుటిలో తప్పించుకుంది. అనంతరం కంగారూల బలహీనతను భారత్‌ బయటపెట్టింది. ముఖ్యంగా ఓపెనర్‌గా డేవిడ్‌ వార్నర్‌ తన స్థాయికి తగినట్లుగా ఆడలేకపోయాడు. అసలు భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో ఆ జట్టు అనుసరించిన వ్యూహంపైనే అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.వార్నర్‌తో పాటు కెప్టెన్‌ ఫించ్, స్మిత్‌ రాణిస్తే ఆ జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.

పాక్‌పై అద్భుత రికార్డు ఉన్న మ్యాక్స్‌వెల్‌ దానిని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌లను ఎదుర్కోవడం పాక్‌కు అంత సులువు కాదు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులు చేసే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ గాయపడటంతో అతని స్థానంలో బ్యాట్స్‌మన్‌ షాన్‌ మార్ను ఎంపిక చేయవచ్చు. కూల్టర్‌ నైల్, ఆడమ్‌ జంపాలకు బదులుగా రిచర్డ్సన్, లయన్‌లను ఆడించాలని కూడా జట్టు భావిస్తోంది. మరోవైపు తొలి పోరులో విండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ను ఓడించి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అదే జోరులో బలహీన లంకను ఓడించాలని భావించినా... వరుణుడు దానికి అడ్డు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌లాంటి జట్టును ఓడిస్తే టోర్నీ లో పాక్‌ సెమీస్‌ అవకాశాలు కచ్చితంగా మెరుగవుతాయి.

ఇటీవల యూఏఈ వేదికగా ఆసీస్‌ చేతిలో 0–5తో ఓడినా ఆ సిరీస్‌కు ప్రధాన ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం జట్టుపై ఉండకపోవచ్చు. ఆసీస్‌ స్పిన్‌ బలహీనతను దృష్టిలో ఉంచుకొని పేసర్‌ హసన్‌ అలీ స్థానంలో ఇమాద్‌ను ఆడించాలని జట్టు ఆలోచిస్తోంది. వహాబ్‌ రియాజ్, షాహిన్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. 2015 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో వాట్సన్‌కు రియాజ్‌ వేసిన భీకరమైన స్పెల్‌ను క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. వారు మళ్లీ అలాంటి హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు. మరోవైపు ఆసీస్‌కు అనుకూలంగా ఉండేలా పేస్, బౌన్స్‌లతో నిండి ఉన్న పిచ్‌ను ఈ మ్యాచ్‌కు కేటాయించడంపై పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.  ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్‌కూ వానగండం కనిపిస్తోంది. టాంటన్‌లో బుధ వారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేప థ్యంలో మ్యాచ్‌ ఎలా సాగుతుందో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top