జర్మనీ తోడుగా... నీడగా మెక్సికో! 

fifa world cup 2018:Mexico special story - Sakshi

గ్రూప్‌ ‘ఎఫ్‌’లో డిఫెండింగ్‌ చాంపియన్‌

నిలకడైన మెక్సికోకు రెండో బెర్తు!

స్వీడన్, కొరియాలూ గట్టివే  

చెక్కుచెదరని రికార్డుల జర్మనీ... పక్కాగా నాకౌట్‌ చేరే మెక్సికో... మూడు దశాబ్దాలుగా ఎదుగుతున్న దక్షిణ కొరియా... పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తున్న స్వీడన్‌...! మూడు ముక్కల్లో ప్రపంచ కప్‌ గ్రూప్‌ ‘ఎఫ్‌’ విశ్లేషణ ఇది. అయినా, అన్నింటిలోకి డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీనే మెరుగు. మిగతా జట్లకూ చెప్పుకోదగ్గ రికార్డు ఉండటంతో మ్యాచ్‌లు సాగేకొద్దీ సమీకరణాలు మారొచ్చు. ప్రస్తుతానికి జర్మనీ, మెక్సికోలవే తొలి రెండు బెర్తులని అంచనా.  

జర్మనీ... జగజ్జేతకు నిర్వచనం 
ప్రపంచకప్‌ను అత్యధికసార్లు గెల్చుకున్నది బ్రెజిలే (5) అయినా, టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు మాత్రం జర్మనీనే. నాలుగుసార్లు విజేత కావడంతోపాటు, నాలుగు సార్లు రన్నరప్‌గా, మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలవడం వంటి రికార్డులే ఇందుకు సాక్ష్యం. అర్హత పోటీల్లో ఓటమన్నదే లేకుండా, 2017లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, రష్యాలోనే జరిగిన కాన్ఫెడరేషన్స్‌ కప్‌ను తొలిసారి గెల్చుకుని...  గతంలో ఏ డిఫెండింగ్‌ చాంపియన్‌ లేనంతటి ఫామ్‌తో ఈసారి బరిలో దిగుతోంది. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో 43 గోల్స్‌ సాధించిన ఈ జట్టు మంచి కూర్పుతో కూడా ఉంది. ప్రత్యర్థులు అసాధారణంగా ఆడితే తప్ప జర్మనీని ఓడించడం అసాధ్యం. గ్రూప్‌లో అగ్రస్థానంతో నాకౌట్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.  
కీలకం: టోనీ క్రూస్‌. చురుకుదనం, తెలివి రెండూ ఉన్న మిడ్‌ ఫీల్డర్‌.  
కోచ్‌: జాకిమ్‌ లో. 2014 ప్రపంచకప్‌లోనూ కోచ్‌గా ఉన్నాడు. ఉన్నత స్థాయి అధికారి తరహాలో కనిపించే ఇతడు మంచి వ్యూహకర్త. 
ప్రపంచ ర్యాంక్‌:
చరిత్ర: 1930, 1950లో మినహా మిగతా అన్ని ప్రపంచకప్‌లో పాల్గొంది. 1954, 1974, 1990, 2014లలో చాంపియన్‌గా... 1966, 1982, 1986, 2002లలో రన్నరప్‌గా నిలిచింది. 1934, 1970, 2006, 2010లలో మూడో స్థానం పొందింది.  

మెక్సికో... నాకౌట్‌ జట్టు  
పెద్దగా పేరు లేకున్నా, ప్రపంచకప్‌లో మెక్సికోది చెప్పుకోదగ్గ చరిత్రే. మూడుసార్లు మాత్రమే అర్హత సాధించడంలో విఫలమైందీ జట్టు. 1994 నుంచి లీగ్‌ దశ దాటుతోంది. అక్కడి నుంచి మాత్రం ముందుకెళ్లలేకపోతోంది. అర్హత పోటీల్లో అదరగొట్టి మూడు మ్యాచ్‌లు ఉండగానే బెర్తు దక్కించుకుంది. ఈసారి క్వార్టర్స్‌కు చేరినా విజయవంతం అయినట్లే.  
కీలకం: జేవియర్‌ హెర్నాండెజ్‌. జీసస్‌ కరోనా, హిర్వింగ్‌ లొజానో. 
కోచ్‌: జువాన్‌ కార్లోక్‌ ఒసొరియో. విస్తృత స్థాయి ప్రణాళికలు, మెరుపు దాడుల వ్యూహాలు పన్నడంలో మేటి. భావోద్వేగాలపై అదుపు లేని వ్యక్తి.  
ప్రపంచ ర్యాంక్‌: 15 
చరిత్ర: 15 సార్లు కప్‌లో పాల్గొంది. ఆతిథ్యం ఇచ్చిన రెండుసార్లు (1970, 1980) క్వార్టర్స్‌కు చేరడమే అత్యుత్తమం. 

కొరియా... మరింత ముందుకెళ్తుందా? 
ఆసియాలో బలమైన జట్టు. 1986 నుంచి ప్రపంచకప్‌ బరిలో ఉంటోంది. ఈసారి అర్హత పోటీల్లో కొంచెం ఉత్కంఠ ఎదుర్కొంది. ఇరాన్‌ను సిరియా ఓడించలేకపోవడం, ఉజ్బెకిస్తాన్‌తో 0–0తో మ్యాచ్‌ డ్రా కావడం కొరియాకు కలిసొచ్చింది. జట్టులో కీలకమైన సన్‌ హ్యుంగ్‌ మిన్, కి సుంగ్‌ యంగ్, లీ చంగ్‌ యాంగ్‌ల త్రయానికి ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌లు ఆడిన అనుభవం ఉంది. వీరిపైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది.  
కీలకం: సన్‌ హ్యుంగ్‌ మిన్‌. ఇంగ్లిష్‌ లీగ్‌లలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆసియా ఆటగాడు. కి సంగ్‌ యంగ్‌ మూడో ప్రపంచ కప్‌ ఆడుతున్నాడు. మిడ్‌ ఫీల్డ్‌లో ఇతను ఉండటం బలం. 
కోచ్‌: షిన్‌ టె యాంగ్‌. మాజీ మిడ్‌ ఫీల్డర్‌. ప్రపంచకప్‌ అవకాశాలు సంక్లిష్టమైన దశలో గతేడాది జూలైలో బాధ్యతలు తీసుకున్నాడు. జట్టుకు రష్యా బెర్తు ఖరారు చేశాడు. గతంలో జూనియర్‌ జట్టుకు శిక్షణ ఇచ్చాడు.  
ప్రపంచ ర్యాంక్‌ : 57 
చరిత్ర: ప్రపంచకప్‌లో దిగడం ఇది 10వసారి. 2002లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ కప్‌లో సెమీస్‌కు చేరింది. గత కప్‌లో 27వ స్థానంలో నిలిచింది. 

స్వీడన్‌... ఇటలీని ఇంటికి పంపి 
ఎప్పుడో 1958లో రన్నరప్‌గా, 1994లో మూడో స్థానంలో నిలవడం తప్ప ఇటీవలి కాలంలో ఏమాత్రం మెరుగైన ప్రదర్శన లేని జట్టు స్వీడన్‌. అయితే, ఈసారి అర్హత మ్యాచ్‌ల్లో దిగ్గజ ఇటలీని ఓడించి ఆ జట్టును ప్రపంచకప్‌కే దూరం చేసింది. 2006 తర్వాత స్వీడన్‌ ప్రపంచ కప్‌ పోటీలోఉంది. జట్టు పటిష్ఠంగా ఉంది.  
కీలకం: ఎమిల్‌ ఫోర్స్‌బెర్గ్‌. స్ట్రయికర్‌ జ్లటన్‌ ఇబ్రహిమోవిక్‌ రిటైరవడంతో ఆశలన్నీ ఫోర్స్‌బెర్గ్‌పైనే ఉన్నాయి.  
కోచ్‌: జాన్‌ అండర్సన్‌. 2016 నుంచి కోచ్‌గా ఉన్నాడు. విస్తృత అనుభవం ఉంది. జట్టును పునర్‌ నిర్మించాడు.  
ప్రపంచ ర్యాంక్‌: 24 
చరిత్ర: 1930 నాటికి పోటీలో లేదు. తర్వాత నుంచి 11 సార్లు అర్హత సాధించింది. 8 సార్లు విఫలమైంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top