మెస్సీ హోరు

మెస్సీ హోరు - Sakshi


రియో డి జనీరో: ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడైన లియోనల్ మెస్సీ తన మ్యాజిక్ ఆటతీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఓ గోల్‌తో పాటు జట్టు ఖాతాలో చేరిన మరో ‘గోల్’కు పరోక్షంగా సహకరించాడు. దీంతో గ్రూప్ ఎఫ్‌లో బోస్నియా అండ్ హెర్జ్‌గోవినాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో నెగ్గింది. అయితే ప్రపంచకప్‌లో తొలిసారిగా బరిలోకి దిగిన బోస్నియా కూడా బాగానే పోరాడింది. మూడో నిమిషంలోనే సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థికి ఆధిక్యమిచ్చినా ఆ తర్వాత మెస్సీ బృందం సొంత గోల్ చేసేందుకు 65 నిమిషాల సమయం పట్టిందంటే వీరి ఆటతీరును ఊహించవచ్చు.



మెస్సీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

- మ్యాచ్ ప్రారంభంలోనే అర్జెంటీనాకు ప్రత్యర్థి నుంచి ఊహించని ‘సహకారం’ లభించింది. మెస్సీ సంధించిన ఫ్రీ కిక్‌ను గోల్ పోస్టు ముందున్న బోస్నియా డిఫెండర్ సీడ్ కొలాసినాక్ కాలితో దాని దిశను మార్చబోగా అనుకోని రీతిలో నెట్‌ను తాకింది. రెండు నిమిషాల ఎనిమిది సెకన్లలో వచ్చిన ఈ గోల్ ప్రపంచకప్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో నమోదైన సెల్ఫ్ గోల్‌గా రికార్డుకెక్కింది.

- ఆ తర్వాత మాత్రం బోస్నియా ప్రత్యర్థికి గట్టి పోటీనే ఇచ్చింది. మెస్సీని అడ్డుకోవడంలో వీరు సఫలమయ్యారు. దీనికి తోడు అర్జెంటీనా తమకు లభించిన అవకాశాలను వినియోగించుకోలేకపోయింది.

- దీంతో ద్వితీయార్థంలో అర్జెంటీనా కోచ్ 5-3-2 ప్రణాళిక నుంచి 4-3-3ని అమల్లో పెట్టారు. 65వ నిమిషంలో మెస్సీ తన ట్రేడ్‌మార్క్ షాట్‌తో అదరగొట్టాడు. పిచ్ మధ్యలో నుంచి స్ట్రయికర్ గోంజలో హిగువాన్‌తో పాస్‌లను మార్చుకుంటూ డి ఏరియాలో ముగ్గురు డిఫెండర్లను బోల్తా - - మెస్సీ గోల్ సాధించాడు. దీంతో జట్టు 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

- అనంతరం మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఇబిసెవిక్ (85వ ని.) బోస్నియా జట్టు తరఫున తొలి ప్రపంచకప్ గోల్ సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top