అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం: రోహిత్‌

Fielding Mistakes Cost India 1st T20I, Says Rohit - Sakshi

ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందడం పట్ల టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా దిగిన భారత్‌కు షాక్‌ తగలడానికి ఫీల్డింగ్‌ తప్పిదాలే కారణమని పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌ వైఫల్యంతో తగిన మూల్యం చెల్లించుకున్నామని అసహనం వ్యక్తం చేశాడు. ‘ మేము సాధించిన స్కోరు అత్యంత స్పల్పమేమీ కాదు. మ్యాచ్‌ను కాపాడుకునే టార్గెట్‌నే బంగ్లాకు నిర్దేశించాం. కాకపోతే ఫీల్డింగ్‌లో వైఫల్యాలు మా ఓటమికి కారణమయ్యాయి.  ముష్పికర్‌ రహీమ్‌ను ఔట్‌ చేసే అవకాశాలు రెండుసార్లు వచ్చినా వాటిని మిస్‌ చేసుకున్నాం.

దాంతో పాటు ఆది నుంచి ఒత్తిడికి గురయ్యాం. బ్యాటింగ్‌ చేపట్టిన దగర్నుంచీ ఒత్తిడిలోనే ఉన్నాం. మరొకవైపు ప్రస్తుత జట్టులో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉండటమే.  వారి ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. మరొకవైపు మా అనుభవలేమిని బంగ్లాదేశ్‌ బాగా సద్వినియోగం చేసుకుంది. ఇక్కడ క్రెడిట్‌ బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిందే’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. ఇక యజ్వేంద్ర చహల్‌ గురించి రోహిత్‌ మాట్లాడుతూ.. ‘  ఈ ఫార్మాట్‌లో చహల్‌ మాకు ఎప్పుడూ కీలక బౌలరే. ప్రత్యేకంగా మిడిల్‌ ఓవర్లలో అతని బౌలింగ్‌తో ముఖ్య పాత్ర పోషిస్తాడు. బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో చహల్‌ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేస్తాడు’ అని ప్రశంసించాడు.

 ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా, అనంతరం బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top