కోహ్లికి ధోని అవసరం ఉంది కాబట్టే..

Dhoni will continue till 2019 World Cup, Sourav Ganguly

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని అవసరం ఇంకా ఎంతో ఉందని అంటున్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ప్రధానంగా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లికి ధోని అవసరం ఉందనే అభిప్రాయాన్ని గంగూలీ వ్యక్తం చేశాడు.  ఒక కీపర్ గా నే కాకుండా, సారథిగా పని చేసిన అనుభవం ధోని జట్టులో కొనసాగడానికి కారణమవుతుందన్నాడు. అందుచేతనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ధోనికి మద్దతుగా నిలుస్తున్నాడన్నాడు. తన దృష్టిలో 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ ధోని భారత జట్టులో  కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.

'వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోని జట్టుతో పాటు ఉంటాడని అనుకుంటున్నా. ధోని నాయకత్వ లక్షణాలే అతను ఇంకా జట్టులో కొనసాగడానికి ముఖ్య కారణం. కోహ్లి  కెప్టెన్సీ చేపట్టిన తరువాత కూడా ధోని సలహాలు జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఈ విషయం కోహ్లి కూడా తెలుసు. ఒక కీపర్ గా మాత్రమే ధోనిని కోహ్లి జట్టులో కోరుకోవడం లేదు. ధోని ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఘనత సాధించాడు.36 ఏళ్ల వయసులో కూడా ధోని జట్టులో ఉన్నాడంటే అతని విలువ ఏమిటో కోహ్లికి బాగా తెలుసు. వికెట్ల వెనకే ఉండి వ్యూహాల్ని రచించడంలో ధోని దిట్ట. అందుకే ధోనికి కోహ్లి మద్దతుగా నిలుస్తున్నాడు. 2004లో చూసిన ధోనికి-ఇప్పటి ధోనికి తేడా ఉండొచ్చు. వయసు పెరిగే కొద్ది ఎవరి గేమ్ అయినా మారుతూ వస్తుంది. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆట కూడా వయసుతోపాటే మారుతూ వచ్చింది. అలానే ఇప్పుడు ధోని ఆట కూడా మారింది. ధోని ఫిట్ గా ఉంటే మాత్రం వచ్చే వరల్డ్ కప్ లో ఆడటం ఖాయం'అని గంగూలీ స్పష్టం చేశాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top