ధోని అంచనా తప్పింది..!

Dhoni missed the trick by not going for the review - Sakshi

విశాఖ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రివ్యూ కోరాడంటే దానికి తిరుగుండదు. ఆ క్రమంలోనే డీఆర్‌ఎస్‌ను ధోని రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారు అభిమానులు. శ్రీలంకతో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో ఉన్న ధోని డీఆర్‌ఎస్‌కు వెళ్లి సక్సెస్‌ అయ్యాడు. స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న జస్ప్రిత్ బూమ్రాను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడానికి చేతిని ఎత్తుతున్న క్రమంలోనే ఏమాత్రం తడబాటు లేకుండా ధోని రివ్యూను కోరి తన అంచనా నిజమని రుజువు చేసుకున్నాడు.

అయితే ఆదివారం అదే శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ధోని అంచనా తప్పింది. శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసే సమయంలో 14 ఓవర్‌ను కుల్దీప్‌ యాదవ్‌ వేశాడు.  ఆ ఓవర్‌ నాలుగో బంతిని లంక ఆటగాడు సదీరా సమరవిక్రమ ఫ్రంట్‌ ఫుట్‌లో ఆడే యత్నం చేశాడు. అయితే ఆ బంతి బ్యాట్‌ నుంచి దాటుకుని అతని కాలిని ముద్దాడింది. దానికి ధోనితో పాటు స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మలు గట్టిగా ఎల్బీకోసం అప్పీలు చేశారు. ఆపై వెంటనే అంపైర్‌ నాటౌట్‌ అంటూ స్పష్టం చేశాడు. దానికి రివ్యూకి వెళ్దామా అంటూ ధోనిని స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ అడిగాడు. దానికి కాసేపు ఆలోచించిన ధోని వద్దనే సలహా ఇచ్చాడు.

 అయితే ఆ బంతి నేరుగా లెగ్‌ స్టంప్‌ను ఎగరేసుకుపోతున్నట్లు రిప్లయ్‌లో కనబడింది. అయితే భారత్‌ రివ్యూకు వెళ్లకపోవడం, ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో సమరవిక్రమ బతికి పోయాడు. ఆ సమయంలో సమరవిక్రమ 15 పరుగుల వద్ద  ఉండగా, అటు తరువాత 42 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఉపుల్‌ తరంగాతో  కలిసి సెంచరీ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి ఎంఎస్‌ ధోని ఎప్పుడో తప్పుకున్నా ఫీల్డ్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే విషయాల్లో అతని పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ధోని సలహాలతో భారత్‌ జట్టు అనేక విజయాల్ని సాధించింది కూడా. కాగా, లంకేయులతో మూడో వన్డేలో ధోని అంచనా తప్పింది. ఇటీవల కాలంలో డీఆర్‌ఎస్‌ విషయంలో ధోని అంచనా తప్పడం  దాదాపు ఇదే 'తొలిసారి' కావచ్చు.

ధోని అంచనా తప్పింది..!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top