రెండో టీమిండియా క్రికెటర్‌గా..

Dhawan become second Indian player to most runs before lunch on any day of a Test - Sakshi

బెంగళూరు: ఒక టెస్టు మ్యాచ్‌ ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన శిఖర్‌ ధావన్‌ మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఏ రోజు పరంగా చూసినా లంచ్‌కు ముందు అత్యధిక పరుగులు చేసిన రెండో టీమిండియా క్రికెటర్‌గా ధావన్‌ గుర్తింపు సాధించాడు. ఇక్కడ హార్దిక్‌ పాండ్యా తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ధావన్‌ నిలిచాడు. గతేడాది పల్లెకెలాలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హార్దిక్‌ 108 పరుగులు సాధించాడు. ఇది ఒక టెస్టు మ్యాచ్‌లో లంచ్‌కు ముందు ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు రికార్డు కాగా, ధావన్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ధావన్‌ లంచ్‌కు ముందు నమోదు చేసిన వ‍్యక్తిగత పరుగులు 104. అయితే లంచ్‌ తర్వాత 107 పరుగుల వద్ద ధావన్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

టెస్టు మ్యాచ్‌ ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు ఒక ఆటగాడు సెంచరీ చేసిన ఘనతను టీమిండియా తొలిసారి సాధించింది. ధావన్‌ 87 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ నమోదు చేయడం ద్వారా భారత్‌ ఈ ఫీట్‌ను సొంతం చేసుకుంది.  అంతకుముందు ఒక టెస్టు ఓపెనింగ్‌ డే లంచ్‌ సమయానికి ముందు భారత్‌ తరపున ఒక ఆటగాడు నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 99. 2006లో సెయింట్‌ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన ​మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 99 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకూ టెస్టు ఓపెనింగ్‌ రోజున లంచ్‌కు ముందు ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోరుగా ఉంది. దాన్ని తాజాగా ధావన్‌ అధిగమించి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఒక రికార్డును భారత్‌ లిఖించినట్లయ్యింది.

ఓవరాల్‌గా చూస్తే టెస్టు ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్‌ ఆరో స్థానంలో ఉన్నాడు. గతంలో వి ట్రంపర్, సీ మకార్ట్నీ, బ్రాడ్‌మన్,మజిద్‌ ఖాన్‌,  డేవిడ్‌ వార‍్నర్‌లు ఈ ఘనత సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top