సరిగ్గా రెండేళ్ల క్రితం స్టీవ్‌ స్మిత్‌..

This day, that year, The Steve Smith act in Bengaluru that left Virat Kohli fuming - Sakshi

బెంగళూరు: రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న స్టీవ్‌ స్మిత్‌-డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ సిస్టం వివాదం గురించి ప్రతీ ఒక్క క్రికెట్‌ అభిమానికి సుపరిచితమే.  అంపైర్‌ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్‌)ను సవాల్‌ చేసే విషయంలో స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ సహాయాన్ని తీసుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది.  2016-17 సీజన్‌లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో నవ్వుల పాలైంది. అది కూడా అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కారణంగానే ఆ జట్టుకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. అది జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఆనాటి స‍్మిత్ వివాదాన‍్ని మరోసారి గుర్తు చేసుకుందాం.

2017, మార్చి4 వ తేదీన ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ఆరంభం కాగా, మార్చి7వ తేదీన ఎల్బీ విషయంలో స్మిత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ను అంపైర్‌ నైజెల్‌ లాంగ్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై డీఆర్‌ఎస్‌కు వెళ్లాలని భావించిన స్మిత్‌ ముందుగా సహచరుడు హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించాడు. అయితే సందేహం తీరక ఏంటి అన్నట్లుగా చేతులతో డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు సైగ చేశాడు.

దీనిని గుర్తించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెంటనే దూసుకొచ్చి అలా ఎలా చేస్తావంటూ స్మిత్‌తో వాదించాడు. ఇది తప్పంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్మిత్‌ను కూడా హెచ్చరించిన అంపైర్, కోహ్లిని కూడా పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ఆటగాడు డీఆర్‌ఎస్‌ విషయంలో మైదానంలో ఉన్నవారితో తప్ప బయటివారి సహాయం తీసుకోరాదు. చివరకు స్మిత్‌ రివ్యూ కోరకుండా నిష్క్రమించాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇక్కడ స్మిత్‌ను మోసగాడంటూ కోహ్లి విమర్శించాడు. అయితే దీనిని సర్దుచెప్పుకునేందుకు స్మిత్‌ నానాపాట్లు పడ్డాడు. ఆ సమయంలో తనకు బుర్ర పనిచేయకే అలా చేశానంటూ స్మిత్‌ వివరణ ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ స్మిత్ తీరును యావత్‌ క్రికెట్‌ ప్రపంచం తప్పుపట్టింది.

ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయానికి 188 పరుగులు అవసరం కాగా, ఆ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో భారత్‌ 75 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో టెస్టు డ్రాగా ముగియగా, నాల్గో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top