చెలరేగిన కమ్మిన్స్‌.. కివీస్‌ కుదేల్‌

 Cummins Took 5 Wickets As New Zealand 148 All Out - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో న్యూజిలాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్‌ ప్రధాన పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌.. కివీస్‌ను బెంబేలెత్తించాడు. ఏ దశలోనూ కివీస్‌ను తేరుకోనీయకుండా చేసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. కమ్మిన్స్‌ ఐదు వికెట్లు సాధించి కివీస్‌ను చావు దెబ్బ కొట్టాడు. వరుస విరామాల్లో వికెట్లు సాధిస్తూ న్యూజిలాండ్‌ ఆటగాళ్లను హడలెత్తించాడు.  కివీస్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(50) మినహా ఎవరూ రాణించలేదు. కమ్మిన్స్‌కు జతగా  జేమ్స్‌ పాటిన్సన్‌ మూడు వికెట్లు తీయగా, మిచెల్‌ స్టార్క్‌కు రెండు వికెట్లు లభించాయి.

44/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన కివీస్‌.. మరో 104 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ఏడో వికెట్‌గా ఔటైన లాథమ్‌ ఒక్కడే కాసేపు ప్రతిఘటించగా మిగతా వారి ఘోరంగా విఫలం చెందారు. దాంతో ఆసీస్‌కు 319 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 467 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ట్రావిస్‌ హెడ్‌(114), స్టీవ్‌ స్మిత్‌(85), లబూషేన్‌(63), టిమ్‌ పైన్‌(79), డేవిడ్‌ వార్నర్‌(41)లు రాణించి ఆసీస్‌ భారీ స్కోరు సాధించడంలో సహకరించాడు. ఇటీవల జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)వేలంలో ప్యాట్‌ కమిన్స్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. కమ్మిన్స్‌ను రూ. 15.5 కోట్లకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కమ్మిన్స్‌ రికార్డు సాధించాడు. మరొకవైపు ఈ ఏడాది 59 టెస్టు వికెట్లతో కమ్మిన్స్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఒక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ బౌలింగ్‌ విభాగంలో కమ్మిన్స్‌దే టాప్‌ ప్లేస్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top