మళ్లీ సూపర్‌ కింగ్స్‌దే పైచేయి

CSK beat RCB by 6 wickets - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే ఆడుతూ పాడుతూ 18.0 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా ఈ సీజన్‌లో ఆర్సీబీపై మరోసారి చెన్నై పైచేయి సాధించింది. చెన్నై ఇన్నింగ్స్‌లో అంబటి రాయుడు (32;25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సురేశ్‌ రైనా(25: 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(31 నాటౌట్‌;1 ఫోర్‌, 3 సిక్సర్లు), బ్రేవో(14 నాటౌట్‌; 17 బంతుల్లో 1 సిక్స్‌)లు తలో చేయి వేసి జట్టుకు విజయాన్ని అందించారు. తాజా విజయంతో చెన్నై ప్లే ఆఫ్‌కు చేరువ కాగా, ఆర్సీబీ  తన ప్లే ఆఫ్‌ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

అంతకుముందు  ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.  ఆర్సీబీ ఆటగాళ్లలో పార్ధీవ్‌ పటేల్‌(53;41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సౌతీ(36 నాటౌట్‌; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. బ్రెండన్‌ మెకల్లమ్‌(5), విరాట్‌ కోహ్లి(8), డివిలియర్స్‌(1), మన్‌దీప్‌ సింగ్‌(7), గ్రాండ్‌ హోమ్‌(8), మురుగన్‌ అశ్విన్‌(1), ఉమేశ్‌ యాదవ్‌(1) ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు.

టాస్‌ గెలిచిన ధోని అండ్‌ గ్యాంగ్‌.. ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ మెకల్లమ్‌ వికెట్‌ను తొమ్మిది పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత పార్దీవ్‌ పటేల్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేసింది. కాగా, జట్టు స్కోరు 47 పరుగుల వద్ద కోహ్లి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఒకవైపు పార్దీవ్‌ నిలకడగా ఆడినప్పటికీ అతనికి మిగతా ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. చెన్నై స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరి వెంట ఒకరు క్యూకట్టారు.  రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌లు తమ స్పిన్‌ మ్యాజిక్‌తో కోహ్లి సేనను ముప్పుతిప్పలు పెట్టారు. మరొకవైపు పేసర్లు డేవిడ్‌ విల్లే, లుంగి ఎంగిడిల నుంచి కూడా స్పిన‍్నర్లు సహకారం లభించడంతో ఆర్సీబీ 15.1 ఓవర్లలో 89 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో సౌతీ బాధ్యతాయుతంగా ఆడటంతో  ఆర్సీబీ వంద పరుగుల మార్కును దాటింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top