ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

Concussion Substitutes ICC Likely to Introduce In Ashes - Sakshi

లండన్‌: ఈ నెల చివరి వారంలో జరగనున్న వార్షిక సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో​ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. 2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌ టోర్నీల్లో 2017 నుంచే సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్‌ షిప్‌’లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాషెస్‌ సిరీస్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని అనుకుంటోంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను ఈ వార్షిక సమావేశంలో చర్చించనుంది. 

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే?
మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్‌ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్‌ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు అంగీకరించరు.  అయితే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా తలకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top