గేల్‌ సెంచరీ

Chris Gayle entertains fans with 24th ODI century - Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌:  వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ తన వన్డే పునరాగమనాన్ని శతకంతో ఘనంగా ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో గేల్‌ (129 బంతుల్లో 135; 3 ఫోర్లు, 12 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగాడు. గేల్‌కు తోడు షై హోప్‌ (65 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించడంతో కడపటి వార్తలందేసరికి వెస్టిండీస్‌ 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించిన గేల్, ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగిపోయాడు.

తొలి 50 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసిన అతను తర్వాతి 50 బంతుల్లో 79 పరుగులు చేసి సరిగ్గా 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. కుదురుకున్నాక మరింతగా విరుచుకు పడిన గేల్‌ సిక్సర్లు మైదానం బయట పడటంతో ఏకంగా నాలుగు సార్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది! గేల్‌ వన్డే కెరీర్‌లో ఇది 24వ సెంచరీ. తాజా మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ కొత్త ఘనతను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అఫ్రిది (476)తో సమంగా ఉండగా... ఇన్నింగ్స్‌లో కొట్టిన తొలి సిక్స్‌తోనే ఈ రికార్డు (477) గేల్‌ సొంతమైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top