'షేర్‌' వాట్సన్‌

Chennai Super Kings won by 64 runs - Sakshi

 57 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్లతో 106

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం

64 పరుగులతో రాజస్తాన్‌ రాయల్స్‌ చిత్తు

ఐపీఎల్‌లో వరుసగా రెండో రోజు వెటరన్‌ శతకపు మోత...36 ఏళ్ల చెన్నై సింహం షేన్‌ వాట్సన్‌ తన పాత ఆటను మళ్లీ ప్రదర్శిస్తూ వీరంగం సృష్టించాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలవోకగా సెంచరీ సాధించి సూపర్‌ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. వేదిక మారినా వేల మంది అభిమానుల మద్దతుతో పుణే పసుపు రంగుతో పోటెత్తగా ధోని సేనకు ‘సొంత మైదానం’లో భారీ గెలుపు దక్కింది. పేలవ బౌలింగ్‌కు తోడు పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి పరాజయానికి దారి వేసుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసింది.   

పుణే: ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో సాధికారిక విజయం. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై 64 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షేన్‌ వాట్సన్‌ (57 బంతుల్లో 106; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... సురేశ్‌ రైనా (29 బంతుల్లో 46; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. తాజా విజయంతో చెన్నై అగ్రస్థానానికి చేరుకుంది.  

రైనా దూకుడు... 
సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న స్టువర్ట్‌ బిన్నీ వేసిన నోబాల్‌తో చెన్నై ఇన్నింగ్స్‌ మొదలైంది. ఆ వెంటనే వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వాట్సన్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఐదో బంతికి స్లిప్స్‌లో తన చేతికి వచ్చిన క్యాచ్‌ను త్రిపాఠి వదిలేయడంతో వాట్సన్‌ బతికిపోయాడు. దీనికి రాజస్తాన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన వాట్సన్‌ జోరు పెంచాడు. మరో ఎండ్‌లో అంబటి రాయుడు (12) తొందరగానే అవుటైనా... రైనా రాకతో స్కోరు మరింత వేగంగా దూసుకుపోయింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన అతను ఈసారి తనదైన శైలిలో చెలరేగిపోతూ స్టోక్స్‌ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. గౌతమ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ‘వాట్టో’ తర్వాతి రెండు బంతులను కూడా ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. గోపాల్‌ ఓవర్లో రైనా వెనుదిరగడంతో 81 పరుగుల (44 బంతుల్లో) రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ధోని (5) ప్రభావం చూపలేకపోగా... 15 ఓవర్లు ముగిసే సరికి సూపర్‌ కింగ్స్‌ స్కోరు 161 పరుగులకు చేరింది. ఈ స్థితినుంచి రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని నిలువరించగలిగారు. బిల్లింగ్స్‌ (3) విఫలం కాగా, ఉనాద్కట్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా సింగిల్‌ తీసి వాట్సన్‌ 51 బంతుల్లో తన టి20 కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డ్వేన్‌ బ్రేవో (16 బంతుల్లో 24 నాటౌట్‌; 4 ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా, చివరి ఐదు ఓవర్లలో చెన్నై 43 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

స్టోక్స్‌ మినహా... 
దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్లో రహానే కొట్టిన సిక్స్, ఫోర్‌ సహా మొత్తం 14 పరుగులు రావడంతో రాయల్స్‌ ఇన్నింగ్స్‌ దూకుడుగా ప్రారంభించింది. అయితే తొలిసారి ఐపీఎల్‌ బరిలోకి దిగిన క్లాసెన్‌ (7)ను అవుట్‌ చేసి ఠాకూర్‌ చెన్నైకి మొదటి వికెట్‌ అందించాడు. అంతకుముందు సున్నా వద్ద వాట్సన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన క్లాసెన్‌ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. తర్వాతి ఓవర్లోనే సంజు శామ్సన్‌ (2) కూడా వెనుదిరగడంతో రాయల్స్‌ ఇబ్బందుల్లో పడింది. చహర్‌ చక్కటి బంతితో రహానే (16)ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో జట్టు కష్టాలు మరింత పెరిగాయి. పవర్‌ప్లేలో రాజస్తాన్‌ 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో బట్లర్‌ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌), స్టోక్స్‌ కలిసి నాలుగో వికెట్‌కు 34 బంతుల్లో 45 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే బ్రేవో తన వరుస ఓవర్లలో బట్లర్, త్రిపాఠి (5)లను అవుట్‌ చేయడంతో కోలుకోలేకపోయిన రాయల్స్‌... స్టోక్స్‌ను తాహిర్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.

వాట్సన్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ తరఫున ఆడి చెన్నైపై సెంచరీ సాధించగా... ఈసారి చెన్నై తరఫున రాజస్తాన్‌పై శతకం బాదాడు. ఐపీఎల్‌లో ఒక ఆటగాడు ఇలా సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top