అశ్విన్‌, జడేజాలు ప్రతిసారి ఆడలేరు: రవిశాస్త్రి

అశ్విన్‌, జడేజాలు ప్రతిసారి ఆడలేరు: రవిశాస్త్రి

సాక్షి, చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లను ఎంపిక చేయకపోవడం పట్ల వచ్చిన విమర్శలపై భారత్‌ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి స్పందించారు. ప్రతిసారి అశ్విన్‌, జడేజాలతో ఆడలేమని, ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉందన్నారు. టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించడం కోసం వారికి విశ్రాంతి కల్పించామని పేర్కొన్నారు.  జట్టులోకి ఎంపికవ్వడం వారికి పెద్ద విషయం కాదని, దీని రాద్దాంతం చేయడం తగదని రవిశాస్త్రి హితవు పలికారు.

 

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆసీస్‌తో జరిగే మూడు వన్డేలకు అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి కల్పిస్తూ భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జట్టు ప్రకటించే సమయంలోనే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా రోటేషన్‌ పద్దతిని ఆటగాళ్లను ఎంపికచేశామని ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. దీంతో స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి కల్పించామని పేర్కొన్నారు.

 

ఈ ఎంపికను మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ తప్పుబట్టారు. ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుతో జరిగే వన్డే సిరీస్‌లకు దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి కల్పించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సెలెక్టర్‌నైతే ఇలా చేసేవాడిని కాదని అజారుద్దీన్‌ ఘాటుగా విమర్శించారు. శ్రీలంక పర్యటనలో అక్సర్‌ పటేల్‌, యజువేంద్ర చాహల్‌ రాణించడంతో మరో సారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నో సార్లు అశ్విన్‌, జడేజాలు లేని లోటు తీర్చిన చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో కూడా చెలరేగుతాడని సెలక్షన్‌ప్యానెల్‌ భావిస్తోంది. 
Back to Top