హ్యాట్రిక్‌ రికార్డా.. విన్నింగ్‌ రికార్డా?

Can India make familiar comeback vs New Zealand in Auckland - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత ఫుల్‌ జోష్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియాకు ఊహించని షాక్‌ తగలింది. కచ్చితంగా తొలి వన్డే కూడా మనదే అనుకున్న సమయంలో కివీస్‌ రెచ్చిపోయింది. విరాట్‌ అండ్‌ గ్యాంగ్‌  నిర్దేశించిన 348 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉఫ్‌ అని ఊదేసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. మొదటి వన్డేలో సాధించిన ఘన విజయం కివీస్‌కు  సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అదే ఊపును రెండో వన్డేలో కూడా కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే తలంపుతో న్యూజిలాండ్‌ తమ ప్రణాళికలకు పదును పెడుతుండగా, ఎలాగైనా మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కడవరకూ తీసుకురావాలని టీమిండియా చూస్తోంది. శనివారం ఆక్లాండ్‌ వేదికగా  జరుగనున్న రెండో వన్డేలో ఇరు జట్లు తమ బలాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సన్నద్దమవుతున్నాయి. (ఇక్కడ చదవండి: ‘టేలర్‌.. నాలుక ఎందుకు బయటకు తీస్తావ్‌’)

కాగా, ఇక్కడ ఇరు జట్లను ఒక రికార్డు మాత్రం ఊరిస్తోంది. తొలి వన్డేలో ఓటమి  పాలైనా గత రెండు రెండు సిరీస్‌లను గెలుచుకున్న ఘనత టీమిండియాదైతే, ఇప్పటివరకూ ఇరు దేశాల వన్డే చరిత్రలో కివీస్‌ గడ్డపై భారత్‌ తొలి వన్డేలో పరాజయం చూసిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న దాఖలాలు లేవు. దాంతో అదే సెంటిమెంట్‌ను రిపీట్‌ చేయాలని న్యూజిలాండ్‌ కసితో ఉంది. గతంలో న్యూజిలాండ్‌లో భారత్‌ రెండు వన్డే సిరీస్‌లను మాత్రమే గెలిచింది. 2008-09లో 3-1 తేడాతో కివీస్‌పై గెలిచిన టీమిండియా.. 2019లో 4-1తో సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఈ రెండు సందర్భాల్లో భారత్‌ తొలి వన్డేలో గెలిచిన తర్వాతే న్యూజిలాండ్‌ను వారి గడ్డపై సిరీస్‌లను కైవసం చేసుకుంది. 

విండీస్‌, ఆసీస్‌లపై వెనుకబడ్డా..
గతేడాది చివర్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1తో సాధించింది. ఇక్కడ తొలి వన్డేలో భారత్‌ పరాజయం చెందడం గమనార్హం. భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను విండీస్‌ ఛేదించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. అటు తర్వాత భారత్‌ వరుసగా రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.  అటు తర్వాత ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా టీమిండియా 2-1తోనే కైవసం చేసుకుంది. తొలి వన్డేలో భారత్‌ నిర్దేశించిన 256 లక్ష్యాన్ని ఆసీస్‌ వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. కాగా, మిగతా రెండు వన్డేల్లో భారత్‌ విజయం సాధించడంతో సిరీస్‌ వశమైంది. మరి ఇప్పుడు కూడా టీమిండియా అదే రిపీట్‌ చేయాలంటే ముందుగా రెండో వన్డేలో విజయం సాధించాలి. మరి టీమిండియా రెండో వన్డేలో గెలుపును అందుకుని హ్యాట్రిక్‌ రేసులో నిలుస్తుందో.. లేక కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకుని తమ పాత రికార్డునే రిపీట్‌ చేస్తుందో చూడాలి. (ఇక్కడ చదవండి: ఈసారి ఇద్దర్నీ కలిపి ఆడించండి: భజ్జీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top