సింధు గర్జన

BWF World Championships: PV Sindhu enters semi-finals, Saina Nehwal exits - Sakshi

క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒకుహారాపై విజయం

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగోసారి సెమీస్‌లోకి

నాలుగో పతకం ఖాయం చేసుకున్న తెలుగు తేజం

నేడు యామగుచితో సెమీఫైనల్‌

తనకెంతో కలిసొచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మరోసారి గర్జించింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో వరుసగా ఐదోసారి బరిలోకి దిగిన ఆమె నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పకడ్బందీ ఆటతీరుతో చెలరేగిన సింధు వరుస గేముల్లో గెలిచింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్‌కే చెందిన అకానె యామగుచితో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.

నాన్‌జింగ్‌ (చైనా): ఈ ఏడాది ఒక్క టైటిల్‌ కూడా గెల్చుకోలేకపోయిన భారత స్టార్‌ పీవీ సింధు ఆ కొరతను తీర్చుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగమ్మాయి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫైనల్‌ పోరుకు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్‌ సింధు 21–17, 21–19తో డిఫెండింగ్‌ ప్రపంచ చాంపియన్, ఆరో ర్యాంకర్‌ నొజోమి ఒకుహారాపై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో అకానె యామగుచితో సింధు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సింధు మ్యాచ్‌ సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే అవకాశముంది. యామగుచితో ముఖాముఖి రికార్డులో సింధు 6–4తో ఆధిక్యంలో ఉంది. మరో సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో హీ బింగ్‌జియావో (చైనా) ఆడుతుంది.  

ఒకుహారాతో 58 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో కీలకదశలో సింధు పాయింట్లు నెగ్గి పైచేయి సాధించింది. 12వసారి ఒకుహారాతో తలపడిన సింధు ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో దిగినట్లు కనిపించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడటంలో సిద్ధహస్తురాలైన ఒకుహారాకు దీటుగా సింధు ఆటతీరు కొనసాగింది. అవకాశం ఉన్నపుడల్లా సింధు స్మాష్‌ షాట్‌తో సుదీర్ఘ ర్యాలీలకు ముగింపు ఇచ్చి పాయింట్లు గెల్చుకుంది. అయితే కొన్నిసార్లు నెట్‌పై ఆడి... మరికొన్ని సార్లు నియంత్రణ కోల్పోయి.. అనవసర తప్పిదాలు చేస్తూ సింధు పాయింట్లు కోల్పోయినా ఏదశలోనూ మ్యాచ్‌పై పట్టుజారకుండా జాగ్రత్త పడింది. రెండో గేమ్‌ ఆరంభంలో సింధు 0–5తో వెనుకబడినా ఆందోళన చెందకుండా ఆడి తేరుకుంది. పలుమార్లు స్కోరు సమమయ్యాక... స్కోరు 20–19 వద్ద ఒకుహారా కొట్టిన షాట్‌ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది.
 
సైనా, సాయిప్రణీత్‌లకు నిరాశ 

భారత్‌కే చెందిన మరో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ఏడో సీడ్‌ కరోలినా మారిన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పదో సీడ్‌ సైనా 6–21, 11–21తో చిత్తుగా ఓడిపోయింది. 31 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏదశలోనూ తన ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం భమిడిపాటి సాయిప్రణీత్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగాడు. ఆరో సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ 12–21, 12–21తో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 17–21, 10–21తో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సివె–హువాంగ్‌ యాకియోంగ్‌ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది.  

►6 సింధు విజయంతో వరుసగా ఆరో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో పతకం చేరినట్టయింది. 2011లో జ్వాల–అశ్విని జోడీ కాంస్యం... 2013, 2014లలో సింధు కాంస్యాలు... 2015లో సైనా రజతం... 2017లో సింధు రజతం, సైనా కాంస్యం గెలిచారు.  ఈ ఏడాది సింధుకు పతకం ఖాయమైంది. ఒలింపిక్స్‌ జరిగిన (2012, 2016) ఏడాదిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహించలేదు. 

► నేటి సెమీఫైనల్స్‌  మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top