'అందువల్లే నా పని ఈజీ అయ్యింది'

bowlers wicket abilities make his job as a captain very easy - Sakshi

విశాఖ:శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇది కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు తొలి వన్డే సిరీస్‌. దీనిపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రోహిత్‌.. తొలి వన్డేలో ఓటమి తరువాత తిరిగి సత్తా చాటడంతో పాటు సిరీస్‌ను సాధించడం నిజంగా తమ సమష్టి ప్రదర్శనకు నిదర్శమన్నాడు. ' ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలై వెనుకబడ్డాం. అది నాకు కెప్టెన్‌గా కూడా పరీక్షగా నిలిచింది. తొలి వన్డేలో సాధ్యమైనన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచడంలో విఫలమయ్యాం. ఇక రెండో వన్డే మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మ్యాచ్‌. భారీ పరుగులు సాధించి లంకను ఛాలెంజ్‌ చేశాం. అది మాకు ఫర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌. మూడో వన్డేలో కూడా సమష్టిగా రాణించి సిరీస్‌ను సాధించాం. వికెట్లు సాధించే బౌలర్లు ఉండటం వల్ల కెప్టెన్‌గా నా పని ఈజీ అయ్యింది. వారి సామర్థ్యంతో లంకను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాం.  బౌలర్లు నా పని సులభం చేసి మ్యాచ్‌లో గెలుపును అందించారు. ఈ తరహా బౌలర్లు ఉంటే కెప్టెన్‌గా ఎటువంటి ఒత్తిడి ఉండదు' అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంచితే, రాబోవు 18 నెలలు తమ సత్తాకు అసలు సిసలు పరీక్షగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కానీ దాన్ని అధిగమించి విజయాల్ని సాధించడానికి టీమిండియా సిద్దంగా ఉందని రోహిత్‌ స్పష్టం చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top